English | Telugu
గ్రేటర్ ఫలితంపై జోరుగా బెట్టింగ్స్! ఆన్ లైన్ లో స్పెషల్ కోడ్
Updated : Dec 1, 2020
ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై బెట్టింగ్ కాస్తున్నారు. గెలిచేది ఎవరు, సెకండ్ ప్లేస్ , ఎంత మెజార్టీ వస్తుంది.. ఇలా వివిధ అంశాలపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఇందుకోసం ముందే అన్ని లెక్కలు తీసుకుని పందెలు కాస్తున్నారు. ముఖ్యంగా జరిగిన పోలింగ్ శాతం, కాలనీల వారీగా ఓటింగ్, బరిలో దిగిన అభ్యర్థి ఏ సామాజిక వర్గం, ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎన్ని పోలయ్యాయి, గతంలో అక్కడి నుంచి విజయం సాధించిన క్యాండిడేట్ఎవరు, ఎన్ని ఓట్లతో గెలిచారు, ప్రీ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి, గ్రౌండ్ లెవల్‌లో జనం ఏమనుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీసిన తర్వాతే బెట్టింగ్‌కు దిగుతున్నారు. గ్రేటర్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, రెండో ప్లేస్‌లో ఏ పార్టీ ఉంటుంది తదితర అంశాలపైనా బెట్టింగ్‌లు కాస్తున్నారు.
రెండు వేల రూపాయలు మొదలుకొని రూ. 10 లక్షల వరకు బెట్టింగ్ కడుతున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది ఆ పార్టీపైనే బెట్టింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడంతో గ్రేటర్ బీజేపీలో జోష్ కనిపించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీపైనా హైప్ పెరిగింది. దీంతో బీజేపీపై కూడా పెద్ద సంఖ్యలో పందెం కాస్తున్నారు. ఆ తర్వాత ఎంఐఎం మేయర్ అవుతారనే ప్రచారంతో దానిపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌పై అంతంత మాత్రంగానే బెట్ కడుతున్నారు.
100 డివిజన్లలో గెలుస్తామని టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. దీనిపైనా కొందరు బెట్ కాస్తున్నారు. వంద సీట్లు గెలవకపోతే మూడింతలు ఇచ్చేట్లుగా పందెం కాస్తున్నారు.మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని కొందరు.. కాదు ఎంఐఎం గెలుస్తుందని మరికొందరు బెట్ కాస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లు క్రాస్ చేస్తుందని కూడా పందెం కడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫలానా డివిజన్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తే వెయ్యికి పది వేలు ఆఫర్ చేస్తున్నారు. మేయర్ పదవిని బీజేపీ దక్కించుకుంటుందని కూడా పెద్ద ఎత్తున బెట్ కాస్తున్నారు. టీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిస్తే బెట్‌కు పదింతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ గెలిస్తే మేయర్ పదవి ఫలానా వ్యక్తి అని కూడా పందెం కాస్తున్నారు.
ఎన్నికలే అదనుగా భావించిన బెట్టింగ్ ముఠాలు అమాయకులను ఉసిగొల్పుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశ చూపి బెట్టింగ్‌లోకి దింపుతున్నారని తెలుస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడిన యువకులు ఈ బెట్టింగ్ మొగ్గుచూపి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో కొద్దిమంది అప్పులు చేసి మరీ బెట్టింగ్ కడుతున్నారట. డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్‌పై సంతకం లేదా బైక్స్, మొబైల్స్ పెట్టుకుని రూ.10 మిత్తితో బెట్టింగ్ నిర్వాహకులే డబ్బులు ఇస్తున్నారని కూడా తెలుస్తోంది.