English | Telugu
స్థానిక ఎన్నికలకు కసరత్తు! జగన్ సర్కార్ దిగొచ్చినట్టేనా?
Updated : Nov 28, 2020
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధమని క్లారిటీగా చెప్పనప్పటికి.. ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకోవాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసినట్లే.. రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని జగన్ సర్కార్ తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం పంచాయతీ ఎన్నికలు రెండు వారాల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు పూర్తవుతాయి. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. వాటిని అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. ఏపీలో చివరి సారిగా 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలను 21 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సారి రెండు వారాలకు కుదిస్తున్నారు. 14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయన ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కాని సీఎస్ మాత్రం ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో సాధ్యం కాదని చెబుతూ వస్తోంది. ప్రభుత్వం సహకరించకపోవడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కలెక్టర్లతో నిర్వహించాల్సిన సదస్సులు రెండు సార్లు వాయిదా పడ్డాయి. సీఎస్ అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్ఈసీ సమావేశానికి వచ్చేందుకు కలెక్టర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు కూడా వెళ్లారు నిమ్మగడ్డ. ఈ వివాదం కొనసాగుతుండగానే.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చేస్తూనే.. వాయిదా కోసం చేస్తున్న న్యాయపోరాటం కొనసాగించాలని జగన్ సర్కార్ భావిస్తుందట. హైకోర్టు తీర్పు మరోసారి తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందంటున్నారు. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు అవకాశం లేకుండా ఉండే విధంగా వీలైనంత కాలం సాగ దీసి.. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారట. అక్కడ సానుకూల ఫలితం వస్తే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.