English | Telugu

ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..!!

ఏపీ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో సీబీఐతో పాటు సర్వీస్ ప్రోవైడర్లు ఉన్నారు. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో సమాధానాలు చెప్పాలని.. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని వారికి ఆదేశాలిచ్చింది.

కాగా, జ‌డ్జిలపై నిఘా ఉంచార‌ని, ఫోన్స్ ట్యాప్ చేస్తున్నార‌ని మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో అడ్వ‌కేట్ శ్ర‌వ‌ణ్ కుమార్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ ను చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అఫిడవిట్‌లో ఉన్న మీడియా కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. ఐదుగురు జ‌డ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, జ‌డ్జిల క‌ద‌లిక‌ల‌పై ఒక అధికారిని ప్రత్యేకంగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌ని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ మొత్తం అంశంపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో తాజాగా న్యాయవాది శ్రవణ్ కుమార్ అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అనుబంధ అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ట్యాపింగ్ కోసం నియమించిన అధికారి పేరును, అలాగే కొంత మంది సర్వీస్ ప్రొవైడర్ల వద్ద నుంచి కాల్ డేటాను ఎలా సేకరించారో వివరించే ఆధారాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. 16 మందికి నోటీసులు జారీ చేసింది.

న్యాయవాది శ్రవణ్ కుమార్ అఫిడవిట్‌ లో ఏం చెప్పారన్న విషయం బయటకు రాకపోయినప్పటికీ.. ఆయన సమర్పించిన వివరాలతో.. హైకోర్టు 16 మందికి నోటీసులు ఇవ్వడంతో ఆధారాలు బలంగానే ఉండి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నాలుగు వారాల తర్వాత కేసు విచారణకు రానుంది. అప్పుడు విచారణ కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.