English | Telugu

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై సుప్రీంకు జగన్ సర్కార్

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆస్పత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. డాక్టర్ రమేష్‌ పరారీలో ఉన్నారని, దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

రమేష్‌ ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహించిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. డాక్టర్‌ రమేష్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. అదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. స్వర్ణ ప్యాలెస్‌ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారాలు ఎలా అనుమతిచ్చారు? అని నిలదీసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హైకోర్టు.. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టుల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. నిమ్మగడ్డ వ్యవహారం మొదలుకొని, తాజాగా ఇంగ్లీష్ మీడియం అంశంలో కూడా జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఈ స్వర్ణప్యాలెస్‌ ఘటన విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.