English | Telugu

మోదీకి లేఖలు రాసిన సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు...

ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసిన సెలబ్రిటీలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. రామచంద్ర గుహ, మణిరత్నం, అపర్నా సేన్ సహా యాభై మంది ప్రముఖులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. మూకుమ్మడి దాడులు హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వీరు కొద్ది రోజుల క్రితం బహిరంగ లేఖ రాశారు.

అసహనం పై ప్రధానికి రాసిన లేఖతో సెలెబ్రిటీలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. కోర్టు ఆదేశంతో బీహార్ లో కేసు నమోదు అయింది. ప్రముఖులు బహిరంగ లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారి ఆదేశాల మేరకు ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. దేశ ప్రతిష్ఠను మంటగలిపే విధంగా ఉందన్న న్యాయవాది పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

దేశంలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసని, ఇదంత రహస్యమేమీ కాదన్నారు వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్యలపై ప్రధాని మోదీని ప్రశ్నించినా లేదంటే కేంద్రాన్ని ప్రశ్నించినా వారందరినీ జైల్లో పెడతారని రాహుల్ అన్నారు. ఈ విధంగా సినీ నటులపై చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ పై ఎంపి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారని, అంతా బహిర్గతంగానే ఉందని రాహుల్ గాంధీ అన్నారు.