English | Telugu
ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చిన సర్వే ఆఫ్ ఇండియా
Updated : Aug 19, 2020
కేంద్ర ప్రభుత్వం గతేడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. మ్యాప్ లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని ఎంపీ గల్లా జయదేవ్ 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించారు. అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలతో పాటు, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆమోదం మేరకు తాజాగా గల్లా జయదేవ్‌కు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది.
దీనిపై గల్లా జయదేవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతిని పేర్కొనకపోవడాన్ని తాను 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తానని చెప్పారు. దీంతో సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి తాజాగా ప్రకటన చేసిందని, ఏపీ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ మ్యాప్ ను అప్ డేట్ చేసిందని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.