English | Telugu

త్వరలో బైపోల్ షెడ్యూల్.. దుబ్బాకలో వేడీ.. టఫ్ ఫైటే!

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సీట్లకు ఎన్నికలు ఉంటాయని సీఈసీ ప్రకటించింది. దీంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. రామలింగారెడ్డి కుటుంబంలో ఎవరికి టిఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా… తాము ఇక్కడ పోటీ చేయబోమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావచ్చని అనుకున్నారు. అయితే పీసీసీ మాత్రం దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది. గ‌తంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్‌, పాలేరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల పోటీకి నిలిపింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా దుబ్బాక‌లో అభ్య‌ర్థిని నిల‌బెట్టాలని నిర్ణయించింది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కారు పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే ఈ సారి దుబ్బాక‌లో వార్ వ‌న్‌సైడ్‌గా ఉండే ప‌రిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని వివిధ సంస్థల సర్వేల్లో తేలుతోంది. దుబ్బాక టికెట్ కోసం అధికార పార్టీలో పోటీ కూడా తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి భార్యకు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నా ఇంకా క్లారిటీ లేదు. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ లో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి త‌న‌యుడు శ్రీనివాస్‌రెడ్డి సైతం ఈ సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే ఆయ‌న కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తార‌న్న టాక్ కూడా ఉంది.

అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కూడా తర్జనభర్జన పడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వరరెడ్డిని బరిలోకి దించాలా..? లేక విజయశాంతిని నిలబెట్టాలా అనే ఆలోచనలో ఉంది. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌కు గ్రామ స్థాయి వరకూ ఉన్న కార్యకర్తల బలం, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాములమ్మ కూడా పోటీ చేసే విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ కీల‌క నేత ర‌ఘునంద‌న్ రావు పేరు దాదాపు ఖ‌రారైంది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. యువ‌కులే టార్గెట్‌గా ఆయ‌న రాజ‌కీయం న‌డుస్తోంది. పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేస్తూ యువకులను, ఇతర పార్టీల వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ర‌ఘునంద‌న్ రావు ఇక్క‌డ నుంచి 2014, 2018 ఎన్నిక‌ల‌తో పాటు 2019 మెద‌క్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. బిగ్‌బాస్ ఫేం క‌త్తి కార్తీక ఇప్ప‌టికే దుబ్బాకలో ప్రచారం ప్రారంభించారు. మ‌రో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ప్ర‌చారం ప్రారంభించేశారు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాకుండానే దుబ్బాక రాజ‌కీయం వేడెక్కింది.