English | Telugu
తిరుమల భద్రతలో డొల్లతనం... మూడ్రోజులుగా విమానం చక్కర్లు...
Updated : Feb 5, 2020
తిరుమల సప్తగిరులపై మూడు రోజులుగా విమానం చక్కర్లు కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషిద్ధం. పైగా, తిరుమల ఆలయం నో ఫ్లైయింగ్ జోన్ కింద ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయంపై నుంచి వెళ్లకూడదనే నియమం ఉంది. అంతేకాదు తిరుమల కొండపై దేవతలు సంచరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా ఉంది. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వల్ల విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం ఉంది. బ్రిటీష్ కాలంలో ఇలా రెండు విమానాలు ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు ఉన్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, ఏడుకొండలవాడిపై ఎప్పటినుంచో ఉగ్రవాదుల కన్ను ఉంది.. నిత్యం లక్షలాది మంది వచ్చి వెళ్లే ఈ పుణ్యక్షేత్రానికి ఆకాశ మార్గం ద్వారా ముప్పు పొంచి ఉందన్నది నిఘావర్గాల వాదన. అందుకే, ఆలయ సమీప ప్రాంతాన్ని కూడా నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అయితే, ఏడుకొండలపై మూడు రోజుల నుంచి ఎగురుతున్న విమానం భక్తులతోపాటు, అధికారులను కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ భయాలు, ఈ ఆందోళనలు పక్కనపెడితే శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని మాత్రం భక్తులు అపచారంగా భావిస్తున్నారు.
అయితే, తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే... దేశ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా... ఐదేళ్లకోసారి విమానాల ద్వారా సర్వే చేయిస్తుంది. అందులో భాగంగానే కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఛార్టెర్డ్ విమానం శ్రీవారి ఆలయంపై తిరుగుతుందన్నది చెన్నై ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులు చెబుతున్నారు. అయితే... మరోసారి అలా జరగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చింది.
భౌగోళిక అధ్యయనాల కోసమే విమానాలు తిరుగుతున్నాయన్న ఏటీసీ అధికారుల వాదనతో తాము ఏకీభవించేది లేదంటున్నారు భక్తులు. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై జరిగిన వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.