English | Telugu
లంచం తీసుకుంటే జనంతో సమస్య... తీసుకోను అంటే అధికారులతో తంటా...
Updated : Nov 19, 2019
కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకి కోపం... అన్నట్టుంది తెలంగాణలో కొందరు అధికారుల పరిస్థితి. లంచం తీసుకుంటే జనంతో సమస్య... లంచం తీసుకోను అంటే తోటి ఉద్యోగులతో ఇబ్బందులు... ఇదీ నిజాయితీపరులైన అధికారుల పరిస్థితి. తహశీల్దార్ విజయారెడ్డి మర్డర్ తర్వాత... తాను లంచం తీసుకోను అంటూ తన ఛాంబర్‌లో బోర్డు పెట్టుకున్న కరీంనగర్ విద్యుత్ ఉద్యోగి అశోక్... ఊహించనివిధంగా తోటి అధికారులు, ఉద్యోగుల నుంచే బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్... తన ఛాంబర్‌లో... నేను లంచం తీసుకోను అంటూ బోర్డు పెట్టారు. అయితే, మీడియా అండ్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం రావడంతో.... అశోక్ కు ఊహించని విధంగా సమస్యలు మొదలయ్యాయి. తోటి ఉద్యోగులే బెదిరించడం మొదలుపెట్టారు. అశోక్ పెట్టిన బోర్డుతో ఇబ్బందిగా ఫీలవుతోన్న సహ ఉద్యోగులు.... వేధించడం ప్రారంభించారు. నీవు ఒక్కడివే నీతిమంతుడివా? నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని అశోక్ వాపోతున్నారు. తన డిపార్ట్ మెంట్‌లో ఒకరిద్దరు మాత్రమే అభినందించారని, మిగతా వాళ్లు ఇబ్బందిగా ఫీలవుతున్నారని అశోక్ అంటున్నారు. అయితే, సహ ఉద్యోగుల నుంచే కాకుండా.... ప్రజల నుంచి కూడా పెద్దఎత్తున ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయన్న అశోక్.... ఇప్పటివరకు ఎంత తీసుకున్నావ్.... ఇప్పుడు బోర్డు పెడితే సరిపోతుందా అంటూ ఎగతాళి చేస్తున్నారని తెలిపారు. అయితే తాను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిజాయితీగానే ఉన్నానని, తన ఆస్తులపై విచారణ జరపాలని స్వయంగా ఏసీబీకి లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, తోటి ఉద్యోగుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువవడంతో.... ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. కొందరు నీ అంతు చూస్తామంటూ బెదిరించడంతోపాటు సూటిపోటి మాటలతోపాటు మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రెవెన్యూ ఉద్యోగులే కాదు... మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ప్రాణభయంతో వణికిపోతోంది. లంచం కోసం విసిగిస్తే... తెగించినోళ్లు ప్రాణాలు తీసే ప్రమాదముందని జాగ్రత్త పడుతున్నారు. అయితే, ఏ వ్యవస్థలోనైనా... కేవలం జీతంపైనే ఆధారపడుతూ, నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులూ ఉంటారు. అయితే, అలాంటి అధికారులకు తోటి ఉద్యోగుల నుంచే ఊహించనివిధంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, అశోక్ నిజాయితీపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే... మరోవైపు ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటివరకు దోచుకుని... ఇప్పుడు తాపీగా లంచం తీసుకోను అంటూ బోర్డు పెడతారా అంటూ విమర్శిస్తున్నారు. దాంతో, అభినందించే వాళ్లతో పోల్చితే.... వేధించేవాళ్లే ఎక్కువగా ఉన్నారని అశోక్ వాపోతున్నారు.