English | Telugu

విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న దళిత యువకుడి మృతి..

విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న ఒక దళిత యువకుడి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గత నెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చేపలకు ఆహారంగా ఉపయోగించే ఫీడ్ మధ్య‌లో మద్యం సీసాలను పెట్టి గుప్తా అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వీటిని విజయవాడకు పార్సిల్ చేసినట్టు ఎస్ఈబీ పోలీసులు గుర్తించారు. దీనిపై విజయవాడ పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దీనికి సంబంధించి కృష్ణలంక పెద్దవారి వీధికి చెందిన కారు డ్రైవర్ అయిన డి.అజయ్ (26) మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. అజయ్‌ తల్లి నాగమల్లేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. తల్లి సమీపాన ఉన్న చర్చిలో వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్‌, మొగల్రాజపురానికి చెందిన అతడి స్నేహితుడు సాయికిరణ్‌లను నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో వారిని ఎస్‌ఈబీ కార్యాలయం నుంచి పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరి ఆడడం లేదని, ఒళ్లు చల్లబడుతోందని అజయ్ పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో అతడు చనిపోయాడని అజయ్ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అజయ్ మృతికి నిరసనగా దళిత సంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే ఇది లాక్‌పడెత్‌ కాదని, అనారోగ్య కారణాలతో అజయ్‌ చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. అతడిని ప్రశ్నిస్తుండగా చెమటలు పట్టి ఫిట్స్‌ వచ్చాయని, ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని చెబుతున్నారు. అజయ్‌ అనారోగ్యంతో చనిపోయాడని, ఒకవేళ పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. తనకు ఉన్న ఒక్క ఆధారమైన కొడుకు చనిపోవడంతో అజయ్‌ తల్లి తల్లడిల్లుతోంది.