English | Telugu

తెలంగాణలో మరో సర్కార్ దవాఖాన సూపరింటెండెంట్ రాజీనామా

కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ లోని ఎంజిఎం ఆసుప‌త్రి సూప‌రిండెంట్ శ్రీ‌నివాసరావు కూడా రాజీనామా చేశారు. ఒక పక్క క‌రోనా వార్డుల్లో స‌రైన చికిత్స‌లు అందటం లేదని ఆక్సిజ‌న్ లేక రోగులు మ‌ర‌ణిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇలా సూపరింటెండెంట్ ల వరుస రాజీనామాలు కలవర పెడుతున్నాయి.

ఒక పక్క వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ త్వరలో వ‌రంగ‌ల్ ఆసుప‌త్రి, క‌రోనా వైద్యంపై స‌మీక్ష‌కు రానున్న నేప‌థ్యంలో సూప‌రిండెంట్ రాజీనామా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల కొరత గురించి ప్ర‌భుత్వానికి కూడా తెలుస‌ని, అయితే జిల్లాల్లో జ‌రుగుతున్న పొర‌పాట్ల‌కు త‌మ‌ను బాధ్యుల‌ను చేస్తున్నార‌న్న ఆవేద‌న‌లో ప‌లువురు అధికారులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న క‌రోనా తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలోనే ఉండి అన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు నుండి చెప్తుండ‌టంతో పాటు అన్ని వైపులా నుండి వస్తున్న ఒత్తిడిని త‌ట్టుకోలేకే రాజీనామాల బాట ప‌ట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.