English | Telugu

అలవాటులో పొరపాటు.. హస్తం గుర్తుకే మీ ఓటు అని నాలుక కరుచుకున్న జ్యోతిరాదిత్య

రెండు తరాలుగా సింధియా వంశం కాంగ్రెస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తండ్రి మాధవరావు సింధియా.. ఇపుడు జోతిరాధిత్య సింధియా కూడా కాంగ్రెస్ నాయకులే అయినా.. కొద్దీ నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే అయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా, జ్యోతిరాదిత్య సింధియా నోటి వెంట కాంగ్రెస్ అనే మాట మాత్రం అనుకోకుండా వచ్చేస్తోంది. తాజాగా దబ్రా నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార సభలో ఇదే విషయం ఆయనను ఇబ్బందికి గురి చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి తరుఫున ప్రచారం చేస్తున్న ఆయన అనుకోకుండా "హస్తం గుర్తుకే మన ఓటు" అని గట్టిగా పిలుపునిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరచి.. తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకున్నారు .

కొద్ది రోజుల క్రితం కమల్ నాథ్ ఇక్కడ ఒక సభలో మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవిని ఉద్దేశించి "ఐటమ్" గ పేర్కొనడంతో తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య కూడా "దాబ్రా ప్రజలారా, మీ చేతులు కలపండి. నన్ను, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చెప్పండి. 3వ తేదీన జరిగే పోలింగ్ లో మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. అయితే వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, వెంటనే దాన్ని సరిదిద్దుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో జ్యోతిరాదిత్య సింధియా వీడియోలు వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోకు విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.... "సింధియా గారూ... మధ్యప్రదేశ్ ప్రజలు కూడా నవంబర్ 3న హస్తం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు" అని క్యాప్షన్ పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఇమర్తీ దేవితో సహా కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు గత మార్చిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో అక్కడ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.