English | Telugu

మరో రైతు ఉసురు తీసిన రెవెన్యూ ధనదాహం

రైతులను తమ ధన దాహం తో పీడించుకు తింటున్న కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల పుణ్యమా అని మొత్తం రెవెన్యూ డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక తహసీల్దార్ పై ఒక రైతు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. అయినా కొంత మంది అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 1.2 ఎకరాల భూమికి తన పేరు మీద పట్టా ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి వేసారిన 65 ఏళ్ళ రైతు అదే ఆఫీసు ముందు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే రైతు గత్ కొన్ని నెలలుగా కాల్వ శ్రీరాంపూర్ లోని భూమిని తన పేరుతో పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఐతే ఎంతకీ తన పేరుతో పాసు పుస్తకం ఇవ్వకపోవడం తో విసిగిపోయిన ఆ రైతు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు.