English | Telugu
సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు! రెచ్చగొట్టే పోస్టులు వద్దన్న డీజీపీ
Updated : Nov 26, 2020
తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు.
గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని డీజీపీ తెలిపారు.ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.