English | Telugu
తెలంగాణలో స్వైన్ ఫ్లూ మొదలైంది.. ఇప్పటికే 21 మంది మృతి
Updated : Nov 15, 2019
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలవరం రేపుతోంది. రాష్ట్రంలో రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే రాష్ట్రంలో పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతూ ఉండగా.. ఇది చాలదన్నట్లు స్వైన్ ఫ్లూ వాటికి తోడైంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9974 మందిని స్వైన్ ఫ్లూ అనుమానితులుగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1335 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సాధారణంగా చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ స్వైన్ ప్లూ మరింతగా విజృంభిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు స్వైన్ ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ సారి భారీ వర్షాలు కురవటంతో పరిస్థితిని ముందే ఊహించి చర్యలు చేపట్టామని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలో ఐసోలేషన్ వార్డులున్నాయి. అన్ని మందులు అందుబాటులో ఉంచి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదైన కేసుల వివరాలు సైతం తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి నవంబర్ 12 వరకు స్వైన్ ఫ్లూ కేసుల వివరాలను ప్రభుత్వం నవంబర్ 14న విడుదల చేసింది.