English | Telugu

అనవసర పదాలు తొలగించి "జనగణమన" ను మార్చండి.. మోడీకి బీజేపీ ఎంపీ లేఖ

మన దేశ జాతీయ గీతం "జనగణమన" లో కొన్ని అనవసర పదాలు ఉన్నాయని.. వాటిని మార్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. మన జాతీయ గీతంలో ఎవరినో ప్రశంసిస్తూ రాశాఋ అనే అనుమానాలు కూడా ప్రజలలో ఉన్నాయని అయన తెలిపారు. జాతీయగీతంలోని అనవసర పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారని స్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సుభాష్ చంద్ర బోస్ సారధ్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ 21 అక్టోబరు 1943న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే వారు ఆలపించిన గీతాన్నే అమలు చేయాలని నిన్న ప్రధానికి రాసిన లేఖలో స్వామి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ గీతంలో పేర్కొన్న సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలో ఉందని, దీంతో ఆ పదాన్ని తొలగించి "ఈశాన్యం" అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని అయన గుర్తుచేశారు. ఇదే సమయంలో "జనగణమన" లోని "భారత భాగ్య విధాత" అనే పదానికి బదులు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943లో "శుభ్ సుఖ్‌ చైన్"’ అనే పదాన్ని జోడించి ఆలపించింది. అప్పట్లో ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్‌ రచించగా కెప్టెన్‌ రామ్‌సింగ్‌ స్వరపరిచారని అయన తెలిపారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ అంటే రిపబ్లిక్ డే లోపు రూపొందించాలని ప్రధానికి రాసిన లేఖలో అయన సూచించారు.