నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత సోమవారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలిసి తనను మళ్లీ ఏపీ ఎస్ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారని రమేష్ కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలని అయన ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఒక లేఖ పంపారు.