English | Telugu
రజనీతో ఆరెస్సెస్ మంత్రాంగం! బీజేపీకి మద్దతిచ్చే ఛాన్స్?
Updated : Nov 2, 2020
అయితే తాజాగా ఆరెస్సెస్ సిద్ధాంత కర్త, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ తో ఆరెస్సెస్ ముఖ్య నేత దాదాపు గంటన్నర పాటు చర్చించారని తెలుస్తోంది.సూపర్‌స్టార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా... బీజేపీకి మద్దతిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని గురుమూర్తి రజనీకాంత్‌ను కోరినట్లు సమాచారం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రజనీకాంత్‌ను గురుమూర్తి కోరినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జాతీయ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి సూచన ప్రాయంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి గతంలో రజనీకాంత్ పలుమార్లు మద్దతు ప్రకటించారని, బీజేపీ పరిపాలనను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లోగా రజనీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని, ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తుపెట్టు కోవాలని బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖలో సినీ రంగ ప్రముఖుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వెట్రివేల్ పేరుతో ప్రచార యాత్ర కూడా చేస్తోంది. రజనీ వృద్ధాప్య సమస్యలు, కరోనా వైరస్ కారణంగా పార్టీని ప్రారంభించే ఆలోచన విరమించు కుంటున్నట్టు చేసిన ప్రకటన బీజేపీ నేతలకు తీవ్ర నిరాశను కలిగించింది.అందుకే రజనీకాంత్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆరెస్సెస్ ముఖ్య నేత రజనీకాంత్ తో చర్చలు జరిపారని భావిస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టకపోయినా.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేసినా సరిపోతుందనే భావనలో తమిళ కమలనాధులు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రజనీకాంత్ తో స్టేట్మెంట్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి మోడీ సర్కార్ కు సానుకూలంగా ఉన్న రజనీకాంత్.. బీజేపీకి మద్దతుగా ప్రకటన చేయవచ్చని అంతా భావిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ తీసుకోబోయే నిర్ణయంపై అధికార అన్నాడీఎంకే, డీఎంకేసు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. రజనీ పార్టీ పెడితే తమకు ప్లస్ అవుతుందని అన్నాడీఎంకే అంచనా వేస్తోంది.