English | Telugu

మీరు రానవసరం లేదు.. సీఎం కేసీఆర్ కు పీఎంవో ఝలక్

ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ కు ఆకస్మిక పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న మూడు ప్రముఖ సంస్థల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ ట్రయల్స్ పురోగతి, అలాగే ఉత్పత్తి పై చర్చించనున్నారు. అయితే అయన హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ కు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకపక్క జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టిఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కావడంతో ప్రధాని పర్యటన పై ఉత్కంఠ నెలకొంది

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం నేడు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న ప్రధానికి స్వాగ‌తం ప‌లికేందుకు సీఎం కేసీఆర్ రాన‌స‌వ‌రం లేద‌ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) స‌మాచారం ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌ధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. అంతేకాకుండా హకీమ్ పేట విమానాశ్రయంలో ప్ర‌ధానికి స్వాగతం చెప్పడానికి ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చింది. వీరిలో హకీంపేట ఎయిర్‌ ఫోర్స్ ఆఫీస్‌ కమాండెంట్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతి మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది. పీఎంవో తాజా నిర్ణ‌యంపై ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాలు, అటు టీఆర్ఎస్ నేత‌లు అవాక్క‌య్యారు.

సాధార‌ణంగా ప్రధాని రాష్ట్రాల్లో అధికారిక పర్యటనకు వస్తే ఆ రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం ప‌లుకుతారు. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ స్వాగతం చెప్తార‌ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాని కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ అనూహ్యంగా సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయమే స్వ‌యంగా సందేశం పంపడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.