English | Telugu

చంద్రబాబు పార్టీ మూసుకోవాల్సిందే! వైసీపీ నేతల విసుర్లు 

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అధికార వైసీపీ బీసీల సమావేశాలు నిర్వహించింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞత చెబుతూ ఈ సమావేశాలు జరిగాయి. సీఎం అభినందన సభల్లో పాల్గొన్న వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని... హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. ఆయన కుమారుడు ఈ మధ్య ట్రాక్టర్ స్టీరింగ్ వదిలేసి ప్రజలపైకి పోనివ్వబోయారని.... ఆ పార్టీ పరిస్థితి అంతే అని అనిల్ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకి పెద్దపీట వేసింది వైసీపీనే అని మంత్రి తెలిపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటనే నడుస్తానని... ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు నగరి ఎమ్మెల్యే రోజా. బీసీ కార్పొరేషన్ సభలో మాట్లాడిన రోజా .. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. వేల కోట్ల రూపాయల సహాయం అందించారని ప్రశంసించారు. చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలని రోజా ఉచిత సలహా ఇచ్చారు. బీసీలకు చంద్రబాబు ఏం చేసారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఆర్కే రోజా.