English | Telugu
95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా గెలిచిన ఎమ్మెల్యే తండ్రి
Updated : Dec 12, 2025
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు.
100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు.
మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28 శాతం ఓటింగ్ నమోదైంది