English | Telugu

అవసరమైతే సీఎం జగన్‌ ను కలుస్తా: బాలకృష్ణ

హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఇటీవల బాలకృష్ణ హిందూపురం ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మందులను ప్రకటించారు. ఈరోజు ఆయన స్వయంగా వాటిని ఆసుపత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం విషయంలో ఎంత దూరమైన వెళతానని, దానిని జిల్లాగా ప్రకటించాలని, అవసరమైతే సీఎం జగన్‌ ను కూడా కలిసి కోరుతానని తెలిపారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువగా ఉండేదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.