English | Telugu

కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ సంచలనం

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.

విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.

రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.