English | Telugu

తీర్మానం చేసినా మండలి రద్దు కాదు..! న్యాయ నిపుణుల సంచలన వ్యాఖ్యలు

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం... శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం త్వరలోనే కేంద్రానికి చేరనుంది. అయితే, మండలి తీర్మానాన్ని కేంద్రం... పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాక... రాష్ట్రపతి గెజిట్ విడుదల తర్వాతే... కౌన్సిల్ రద్దు జరుగుతుంది. అందుకే, మండలి రద్దు ఒక్క రోజులో తేలిపోయే వ్యవహారం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంపై అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండళ్లపై కేంద్రం దగ్గర ఇప్పటికే అనేక తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయని, దాంతో ఏపీ తీర్మానం ఇప్పటికిప్పుడు ఆమోదం పొందే అవకాశం లేదన్నారు.

మండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్నారు జంధ్యాల రవిశంకర్. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు మండలి కొనసాగుతుందని తెలిపారు. 2013 నుంచి 2019వరకు ఇలాంటివి ఐదు బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని జంధ్యాల అన్నారు. 1970లో యూపీ చేసిన మండలి రద్దుకు తీర్మానం చేసినా ...1980 వరకు కూడా కేంద్రం ఆమోదం పొందలేదని... అప్పటివరకు మండలి కొనసాగిందని గుర్తుచేశారు. ఇక, ఇఫ్పుడు ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై కూడా ఏడాదిలోపు అయితే పార్లమెంట్ లో చర్చ కూడా జరిగే అవకాశం లేదన్నారు.

మరోవైపు, బిల్లులు సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నాయంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు మండలి రద్దు తీర్మానంపై న్యాయస్థానంలో ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనూ శాసనసభలాగే మండలి కూడా యథావిధిగా సమావేశం కావాల్సి ఉంటుందన్నారు. అలాగే, సెలెక్ట్ కమిటీకి అధికార పార్టీ పేర్లు ఇవ్వకపోతే ఛైర్మనే స్వయంగా కొందరిని నియమించుకునే అధికారం ఉందన్నారు.