English | Telugu
చైనా దాడిని తిప్పికొట్టి కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ
Updated : Sep 1, 2020
చైనాతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ముందుకు దూసుకొచ్చిన చైనా సైనికులను వెనక్కు తరిమేసి భారత జవాన్లు కీలకమైన ఓ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఒక ఎత్తయిన ప్రాంతాన్ని చైనా ఆర్మీ నుండి భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారని మన సైనిక వర్గాలు వెల్లడించాయి. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భారత్ దే పై చేయి అయిందని సమాచారం. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇది ఒక కీలక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించడమే కాకుండా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు. అయితే తాజా ఘటనలో ఇరు సైన్యాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని భారత సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చైనా ఆర్మీ రెచ్చగొడుతూ మన భూభాగం లోకి చొరబడుతూ వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.