English | Telugu

కరోనా హాస్పిటల్ లో 101 వ బర్త్ డే జరుపుకున్న పెద్దాయన.. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఐతే వైద్య నిపుణుల సమాచారం ప్రకారం 60 ఏళ్ల పై బడిన వృద్ధుల కు కరోనా సోకితే కోలుకోవడం కొంతవరకు కష్టం. ఐతే తాజాగా మహారాష్ట్ర లోని ముంబై లో వంద సంవత్సరాల పెద్దాయన కరోనా పై విజయం సాధించడమే కాకుండా తన 101వ జన్మదినాన్ని తనకు చికిత్స చేస్తున్న అదే హాస్పిటల్ లో జరుపుకున్నారు.

ముంబైకి చెందిన 100 సంవత్సరాల వయసున్న రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా జులై 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ హాస్పిటల్ లో చేరారు. 12 రోజుల చికిత్స తర్వాత అయన పూర్తిగా కోలుకున్నారు. అంతే కాకుండా బుధవారం ఆయన పుట్టిన రోజు అని అయన కుటుంబ సభ్యులు తెలపడంతో అక్కడి వైద్యులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంతో ఒక చాకొలేట్ కేక్ తెప్పించి నారింగ్రేకర్‌తో కట్ చేయించి ఆయనకు తినిపించారు. ఇలా అయన తన 101వ జన్మదినాన్ని తనను కాపాడిన హాస్పిటల్ లోనే జరుపుకుని తరువాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్ లో జరిగిన అయన బర్త్ డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.