English | Telugu

భారత్ బయోటెక్ లో విదేశీ ప్రతినిధులు! కరోనా టీకా తయారీని వివరించిన డాక్టర్ కృష్ణ ఎల్లా 

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ఫార్మాను ప్రపంచ దేశాల ప్రతినిధులు సందర్శిస్తున్నారు. భారత్‌లో కరోనా టీకాల తయారీపై అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్న 64 దేశాల రాయబారులు జినోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ, ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు, దేశ అవసరాలకు సరిపోయే స్థాయిలో తయారుచేసే సామర్థ్యం తదితర అనేక అంశాలపై వీరు సమీక్షించారు. టీకా కోసం జరుగుతున్న పరిశోధనల సమాచారాన్ని ఈ సందర్భంగా విదేశీ రాయబారులతో పంచుకున్నారు భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా. కొవాగ్జిన్‌ టీకా వివరాలతో పాటు సంస్థ ప్రస్థానాన్ని ఆయన వివరించారు. టీకా రంగంలో భారత్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తోందని చెప్పారు డాక్టర్‌ కృష్ణ ఎల్లా. అనేక విదేశీ సంస్థలతో భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేస్తోందన్నారు. సానుకూల దృక్పథంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని డాక్టర్‌ కృష్ణ ఎల్లా చెప్పారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు మన దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ఆ దేశాలకు చెందిన వైద్య నిపుణులు, వైద్యారోగ్య రంగంలో పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తున్నారు. హెడ్స్ ఆఫ్ మిషన్ అనే పేరుతో వస్తున్న 80 దేశాలకు చెందిన ప్రతినిధుల్లో అరవై మంది ఆయా దేశాల అంబాసిడర్లు (రాయబారులు) ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్… ఇలా చాలా దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇందులో భాగంగా రెండు బృందాలుగా హైదరాబాద్ కు వచ్చారు విదేశీ ప్రతినిధులు. ఒక బృందం జినోమ్‌వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను.. మరో బృందం బయోలాజికల్‌-ఇ సంస్థను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించాయి. భారత్‌ బయోటెక్‌ను గతంలో ఎందరో ప్రముఖులు సందర్శించారు. పదిరోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ కూడా వచ్చి వెళ్లారు.