English | Telugu

జూనియర్ ట్రంప్ ట్వీట్ పై తీవ్రంగా మండి పడుతున్న భారతీయులు..  

హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందనే విషయం పై ప్రపంచం మొత్తం అమెరికా వైపు ఉత్కంఠతో చూస్తోంది. అయితే, ఈ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌ పై అటు ఎన్నారైలు, ఇటు భారత రాజకీయ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రపంచ పటాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్రంప్ జూనియర్.. అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ "ఎరుపు రంగు" లో చూపించారు. ఈ దేశాలన్నీ ట్రంప్ విజయాన్ని సాధిస్తాడని విశ్వాసంతో ఉన్నాయని అయన తెలిపారు. అయితే ఆ ట్వీట్ లో భారత్, చైనా, లైబేరియా, మెక్సికో వంటి కొన్ని దేశాలను మాత్రం డెమోక్రట్‌ పార్టీ కలర్ "నీలి రంగు" లో చూపించారు. ఈ దేశాలు తమ ప్రత్యర్థి జో బైడెన్‌కు మద్దతుదారులని చెప్పుకొచ్చారు. అలాగే, తమ దేశంలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను సైతం ఆయన నీలి రంగులోనే చూపించారు.

అయితే భారత్‌లోని జమ్మూకశ్మీర్‌, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలను మాత్రం ఎరుపు రంగులో చూపించడం వివాదాస్పదమవుతోంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలను నీలి రంగులో చూపి, కొన్ని ప్రాంతాలను మాత్రం ఎరుపు రంగులో చూపడం పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ట్రంప్ భారత్‌కు స్నేహితుడని భావిస్తే, అయన తనయుడు మాత్రం తన బుద్ధిని చూపించారంటూ బీజేపీయేతర పార్టీల నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

ప్రెసిడెంట్ ట్రంప్‌తో భారత్ కు ఎంతో స్నేహం ఉందని, అయితే, ట్రంప్ జూనియర్ మాత్రం భారత్‌ను‌ జో బైడెన్‌, కమల హారిస్‌ మద్దుతుదారుగా చూపించారని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మరింత ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారని అన్నారు. అసలు ఆయన వద్ద ఉన్న కలర్‌ పెన్సిల్‌ను ఎవరైనా లాక్కోవాలని సెటైర్ వేశారు.

అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలుపుతూ జూనియర్ ట్రంప్ ఈ ట్వీట్ చేయడం తాజాగా భారతీయుల కోపానికి కారణమైంది. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. పాకిస్థాన్ తో ఎలా కలుపుతారంటూ ట్రంప్ జూనియర్ పై భారతీయులు నిప్పులు చెరిగారు.. మరోపక్క, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌పై స్పందిస్తూ జమ్మూకశ్మీర్‌ని పాక్ ‌లో భాగంగా చూపించారని, చాలా ప్రోత్సాహకరంగా ఉందని అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.