English | Telugu

హరి హరీ.. ఎస్వీబీసీలో కలకలం రేపుతున్న అశ్లీల సైట్ లింక్

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న భక్తి ఛానల్ ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్ తీవ్ర కలకలం రేపింది. ఎస్వీబీసీలో శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఆ ఛానెల్ కు ఒక భక్తుడు మెయిల్ చేశాడు. దానికి జవాబుగా తిరిగి భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్ పంపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీవారి భక్తుడు ఈ వ్యవహారం పై టీడీడీ చైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎస్వీబీసీ ఆఫీసులో టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైం అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఛానల్ కార్యాలయంలో పోర్న్‌ సైట్‌ లింక్ పంపిన ఉద్యోగితో పాటు.. బాధ్యతలు మరిచి పోర్న్‌సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగుల్ని సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది. అలాగే తమ విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఎస్వీబీసీ అధికారులు, బాధ్యతలు మరిచిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.