English | Telugu

త్వరలో ఆ పార్టీలో చేరనున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన నుండి బయటకు వచ్చిన తరువాత కొంత కాలంగా సైలెంట్ గా ఉండి పోయారు. అయితే తాజాగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అయన కేంద్ర బీజేపీ నాయకులతో డైరెక్ట్ గా కాంటాక్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అంటే ఏమాత్రం పడని అయన, ఏపీ బీజేపీ నేతలు కొంత మంది వైసీపీ అనుకూలవర్గంగా ఉండడంతో వారికంటే కేంద్ర నాయకత్వంతోనే చర్చించి చేరడం బెటర్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికలలో తాను పోటీ చేసిన విశాఖ ఎంపీ సీటు నుండి మళ్ళీ పోటీ చేసే విషయం పై స్పష్టమైన హామీ కోసం అయన కేంద్ర నాయకులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే తనకు జనసేనలో ఎదురైన అనుభవంతో.. పక్కా ప్రణాళికతో విశాఖ ఎంపీ సీటు తనకే అనేది ఫైనల్ చేస్తే.. తాను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటానని లక్ష్మీనారాయణ బీజేపీ పెద్దలతో చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే ఢిల్లీ లో ఉండే ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతతో అయన మాట్లాడారని మాజీ జేడీ సన్నిహితులు తెలియచేస్తున్నారు.

అయితే లక్ష్మీనారాయణ ఇప్పటికే విశాఖ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో ఎక్కడ ఏ సమస్యలున్నాయి.. వాటిని ఎలా పరిష్కరించాలి అనే విషయం పై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేశారని సమాచారం. ఒకసారి బీజేపీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే.. ఆ పార్టీలో చేరి.. వర్క్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ నాయకత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.