English | Telugu
గ్రేటర్ లో సాఫ్రాన్ స్ట్రైక్! కారుకు కోలుకోలేని షాక్
Updated : Dec 4, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాండిది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లు గెలిచిన బీజేపీ... ఈసారి ఏకంగా 50 డివిజన్లు గెలిచింది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంతటా కమలం హవా కనిపించింది. అధికార టీఆర్ఎస్ కేవలం 55 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.పాతబస్తిలో పట్టు నిలుపుకున్న ఎంఐఎం 41 డివిజన్లు గెలుచుకుంది. అయితే ఓల్డ్ సిటీలో కీలకంగా భావించే జాంబాగ్, జంగంమెట్ డివిజన్లలో కమలం వికసించి పతంగి పార్టీకి కొత్త సవాల్ విసిరింది. హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలోనూ బీజేపీ మంచి విజయాలు సాధించింది. కార్వాన్ , చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లోనూ భారీగా ఓట్లు సాధించింది బీజేపీ. 2016 ఎన్నికల్లో ఓల్డ్ సిటీలో భారీగానే ఓట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి పత్తా లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులు ఇంచార్జులుగా ఉండి గల్లిగల్లి తిరిగినా బీజేపీ గాలి ముందు నిలవలేకపోయారు.
దుబ్బాక విజయం తెలంగాణ బీజేపీలో జోష్ పెంచింది. ఇప్పుడు గ్రేటర్ లోనూ అద్భుత ఫలితాలు సాధించడంతో ఇక రాష్ట్రంలో బీజేపీ దూకుడును ఎవరూ ఆపలేరనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకునే వరకు ఈ దూకుడు ఆపేది లేదంటున్నారు కమలం నేతలు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాధులు. వరుస విజయాలతో తెలంగాణలో టీఆర్ఎస్ ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ నిలిచిందని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.