English | Telugu
బీజేపీలోకి 10 మంది టీఆర్ఎస్ నేతలు!
Updated : Nov 18, 2020
వలసలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 10 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పది మంది నేతలు తనతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు సోయం బాపూరావు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందన్నారు సోయం. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత...బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. భయంతోనే అధికార పార్టీ రాయితీలు ప్రకటిస్తోందని సోయం బాపురావు విమర్శించారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం బీజేపీ ఎంపీ వెల్లడించలేదు.