English | Telugu
ఫోన్లు ట్యాపవుతున్నాయా! నగదు అలానే దొరికిందా?
Updated : Oct 9, 2020
రెండు రోజుల క్రితం షామీర్ పేట దగ్గర పోలీసులు ఓ వాహనంలో నలభై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇది బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కు చెందినదిగా వెల్లడించడంతో కలకలం రేగింది. నగదుతో పట్టుబడిన వారితో రఘునందన్ రావు పీఏ మాట్లాడినట్లు తమకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇఫ్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
తన ఫోన్ తో పాటు తన సిబ్బంది ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు విభాగం ఈ పనిచేస్తుందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అక్టోబర్ 5 న జరిగిన సంఘటన ద్వారా ఇది రుజువయ్యిందని, వెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు కోరారు.
బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం వల్లే నగదు దొరికిందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు ఆయన ముఖ్య అనచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ విపక్ష నేతలను టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు. సొంత పనుల కోసం తీసుకెళుతున్న డబ్బులను అక్రమ నగదుగా చూపించే కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఈజీగానే గెలుస్తుందని మొదట భావించారు. అధికార పార్టీగా ఉండటంతో పాటు ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉంది కాబట్టి గెలవడం కారుకు పెద్ద కష్టం కాదనుకున్నారు. కాని ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అధికార పార్టీ గట్టి పోటీనే ఎదుర్కొంటుందని తెలుస్తోంది. నెల రోజుల క్రితమే ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాలన్ని ఒకసారి చుట్టేశారు. రఘునందన్ రావుకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ సర్వేల్లోనూ అదే తేలిందట. దీంతో అధికార పార్టీ అప్రమత్తమై విపక్ష నేతలపై నిఘా పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.
శామిర్ పేట ఘటనతో బీజేపీ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎత్తులకు చిక్కకుండా ప్రచార పర్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారట. కాంగ్రెస్ నేతలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నారట. మొత్తంగా పోటా పోటీగా సాగుతూ రాజకీయ హీట్ రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో... పోలింగ్ నాటికి ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరీ..