English | Telugu

కొత్త వ్యవసాయ చట్టాల కాపీలను అసెంబ్లీ సాక్షిగా చించేసిన సీఎం..  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు 21 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఈ వివాదస్పద వ్యవసాయ చట్టాల కాపీని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో చించేశారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో భాగంగా.. ఈ చట్టాలపై కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవకండి’’ అంటూ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను అడ్డంగా చించేశారు. దీంతో సభలో ఉన్న సభ్యులంతా బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు తమ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ సాక్షిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. ఇదే సమయంలో నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుండి ఒక విజ్ణప్తి చేస్తున్నాను. మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవ్వొద్దు. కరోనా.. లాక్‌డౌన్ సమయం‌లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపజేసేంత అవసరం ఇపుడు ఏమొచ్చింది?’’ అని అసెంబ్లీలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశించారు. అంతేకాకుండా ‘‘రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ చట్టాల గురించి వివరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒకపక్క చెబుతోంది. భూములు తీసుకోవడం లేదు కదా.. ఈ చట్టాల వల్ల రైతులు లాభపడతారని యూపీ సీఎం అంటున్నారు. ఇది నిజంగా ప్రయోజనం చేకూర్చేది అయితే మరి రైతులు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? కొంత మంది బీజేపీ నేతలు అయితే ఏకంగా రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్లర్లు రైతులకు మద్దతు ఇస్తున్నారు. మరి వీళ్లు కూడా దేశద్రోహులేనా? జాగ్రత్త.. ఈ వ్యవహారం పై కేంద్రం వైఖరితో ప్రతి రైతు ఒక భగత్‌సింగ్‌లా తయారవుతున్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.