English | Telugu

రాఫెల్ తొలి పైలట్

భారత వైమానిక దళం శక్తిని పెంచే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ ను చేరాయి. ఏడువేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని రెండురోజుల్లో పూర్తి చేసి విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఈ యుద్ధ విమానాలను నడిపిన పైలట్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కు చేరిన ఈ యుద్ధ విమానంలో తొలి భారత్ పైలెట్ ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథర్.

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధవిమానాల రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధవిమానాల రాకలో గానీ...తొలి పైలట్ గా గానీ వ్యవహరించింది అతనే. అందుకే ఇప్పుడతను వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యుద్ధ విమానాలను నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. మన పైలట్స్ కు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దాంతో భారత్ వైమానిక దళంలో కమాండర్ గా విధులు నిర్వహించే హిలాల్ అహ్మద్ రాథర్ ను ఫ్రాన్స్ పంపించారు. ప్రస్తుతం అతను ఫ్రాన్స్ దేశానికి ఎటాచ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యక్తి. అంతేకాదు రాఫెల్ జెట్స్ ఫ్లైట్స్ భారత్ కు ఇంత త్వరగా రావడానికి కారణం కూడా అతనే.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని బక్షిబాద్‌ హిలాల్ సొంత ప్రాంతం. చిన్నతనంలో ఆ ప్రాంతంలోని సైనిక్ పాఠశాలలో విద్యను పూర్తి చేసి 1988లో వైమానిక దళంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌ను కూడా గెలుచుకున్న హిలాల్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్లైట్ లెఫ్టినెంట్ నుండి ఎయిర్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ పతకాల్ని కూడా అందుకున్నారు.

భారత దేశ సరిహద్దు పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ విమానంలో మార్పులు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుతం తరుణంలో రాఫెల్ జెట్ ఫ్లైట్స్ త్వరగా భారత్ కు రావడంలో కీలకపాత్ర పోషించారు. రాఫెల్ తొలి యుద్ధవిమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ పైలెట్ కూడా తన పేరు నమోదు చేసుకున్నారు.