English | Telugu

ఏపీలో షూటింగ్‌లకు సీఎం‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అనుమతిచ్చారని‌ చిరంజీవి తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అయితే ఇక్కడ కూడా సీఎం జగన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారన్నారు. విశాఖలో స్టూడియోకి గతంలో వైఎస్సార్ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని తెలిపారు. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు.