English | Telugu
ఉన్నా లేన్నట్టు.. లేకున్న ఉన్నట్టు.. ఏంటో కరోనా మాయ
Updated : Aug 25, 2020
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఊహించినదాని కంటే ఎక్కువే ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు నిర్వహించన సర్వేలో నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనా వేశారు. మురుగునీటి నమూనాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఉందని, లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడి తమకే తెలియకుండా కోలుకుంటున్నారని తాజా అధ్యయనం పేర్కోంటుంది.
తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 84,163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం 52,933 మందికి కరోనా పరీక్షలు చేయగా 2579మందిలో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే లో ఇదే పరిస్థితి. కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ గా వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 89,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2,68,828 మంది కోలుకున్నారు. 3.368మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32,92,501 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.