English | Telugu

అంత్యక్రియలకు వెళ్లారు.. అంతే 19 మందికి కరోనా..

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోను కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొన్ని సార్లు మృతి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు ఆలస్యంగా తెలియడం తో అతని అంత్యక్రియలలో పాల్గొన్న వారికీ తెలియకుండానే కరోనా సోకుతోంది. తాజాగా తెలంగాణాలో ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన మహిళ అనారోగ్య కారణాలతో ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఈ నెల 9న మృతి చెందింది. అదే రోజు రాత్రి ఆమెకు జహీరాబాద్ లో బంధు మిత్రులు అంత్యక్రియలు నిర్వహించారు. ఐతే ఆమెకు కరోనా సోకినట్లు ఆ మరునాటి సాయంత్రానికి తెలిసింది. దీంతో అలర్ట్ ఐన మున్సిపల్ మరియు వైద్య సిబ్బంది అంత్యక్రియలలో పాల్గొన్న 25 మంది బంధువులను గుర్తించి ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు. వారి నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ లకు పంపించగా 19 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఐతే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతురాలి అంత్యక్రియలకు మొత్తం 40 మంది హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా సోకిన వారిని అధికారులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.