English | Telugu

గొల్లపూడి మారుతీరావు జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి.. అసలేం జరిగింది?

(ఏప్రిల్‌ 14 గొల్లపూడి మారుతీరావు జయంతి సందర్భంగా..)

రచయితలుగా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత నటులుగా మారిన వారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో అందరి కంటే సీనియర్‌గా గొల్లపూడి మారుతీరావును చెప్పుకోవచ్చు. అయితే సినిమా నటుడు అవ్వాలన్న ఆలోచన ఒక్క శాతం కూడా లేని మారుతీరావు అనుకోకుండానే నటుడిగా అవతారమెత్తారు. అలా మొదలైన ఆయన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. దాదాపుగా 250 సినిమాల్లో అన్ని తరహా పాత్రలు పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆలిండియా రేడియో ఉద్యోగిగా, రచయితగా, సినిమా రచయితగా, నటుడిగా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన గొల్లపూడి మారుతీరావు జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం.

1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని నందబలగ గ్రామంలో సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు గొల్లపూడి మారుతీరావు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎస్‌సి మ్యాథమెటికల్‌ ఫిజిక్స్‌ చేశారు. డిగ్రీ తీసుకున్న సంవత్సరంలోనే ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై హైదరాబాద్‌, విజయవాడలలో పనిచేశారు. వివిధ హోదాల్లో 20 సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. చిన్నతనం నుంచీ సాహిత్యంపై అభిలాష పెంచుకున్న గొల్లపూడి.. ఆ రంగంలో విశేషమైన కృషి చేశారు. 14 ఏళ్ళ వయసులోనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆరోజుల్లో గొప్ప రచయితలుగా పేరు తెచ్చుకున్న వారందరితోనూ గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేది. ఓపక్క ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తూ మరో పక్క తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు.

గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. 1954 డిసెంబర్‌ 9న ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక రేనాడు పత్రికలో ఆయన తొలి కథ అచ్చయింది. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరుతో ఒక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్‌, వాపస్‌ వంటి నాటకాలను నిర్మించి దర్శకత్వం వహించడంతోపాటు అందులో ప్రధాన పాత్ర పోషించేవారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా రూపొంది ఎన్నో అవార్డులు గెలుచుకున్న ‘కళ్లు’ చిత్రానికి గొల్లపూడి కథ అందించారు. ఈ సినిమాకి ఉత్తమ కథా రచయితగా ఆయనకు నంది పురస్కారం లభించింది.

గొల్లపూడి రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్‌, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు.

రచయితగా, నాటక రచయితగా కొనసాగుతున్న సమయంలో సినిమా రంగంలోని ప్రముఖులతో కూడా ఆయనకు పరిచయాలు ఉండేవి. 1963లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. కోడూరి కౌసల్యాదేవి చక్రభ్రమణం నవలకు సినిమా అనుకరణ రాయాలని గొల్లపూడిని కోరారు దుక్కిపాటి. తనకు సినిమా స్క్రిప్ట్‌ ఎలా రాయాలో తెలీదు అని చెప్పినప్పటికీ దుక్కిపాటితోనే ఉన్న దాశరథి ధైర్యం చెప్పారు. అలా ఆ సినిమాకి స్క్రీన్‌ప్లే రాయడం ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యారు గొల్లపూడి. ఈ సినిమాతో ఆయనకు రచయితగా చాలా మంచి పేరు వచ్చింది. దాంతో బిజీ రైటర్‌ అయిపోయారు. రోజుకి నాలుగైదు షిఫ్టులతో ఏడాదికి 30 సినిమాలకు పనిచేసేవారు.

1963 నుంచి 1981 వరకు రచయితగానే కొనసాగిన గొల్లపూడి జీవితాన్ని ఆ సంవత్సరం మలుపు తిప్పింది. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రతాప్‌ ఆర్ట్స్‌ రాఘవ. ఆ సినిమా కోసం గొల్లపూడిని కథ రెడీ చెయ్యమని చెప్పారు. ఆ కథ అందరికీ బాగా నచ్చింది. అయితే అందులో సుబ్బారావు అనే క్యారెక్టర్‌ మాత్రం గొల్లపూడే చెయ్యాలని రాఘవ పట్టుపట్టారు. గొల్లపూడి నాటకాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమా వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. అలాంటిది ఆ సినిమాలో కీలక పాత్ర పోషించమని అడిగే సరికి ఆయన షాక్‌ అయ్యారు. తన వల్ల కాదని చెప్పారు. కానీ, రాఘవ వినలేదు. ఆ కథలోని సుబ్బారావు క్యారెక్టర్‌కి మీరైతేనే న్యాయం చెయ్యగలరు అని చిరంజీవి పదే పదే చెప్పడంతో కాదనలేక ఆ పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు గొల్లపూడి. అదే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి సిల్వర్‌ జూబ్లీ జరుపుకోవడమే కాకుండా గొల్లపూడికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. దాంతో ఆయనకు వరసగా అవకాశాలు రావడం మొదలైంది. 42 సంవత్సరాల వయసులో నటుడిగా కెరీర్‌ ప్రారంభించి దాదాపు 250 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు గొల్లపూడి. రచయితగా, నటుడిగా ఆయనకు 7 నంది అవార్డులు లభించాయి. ఇవికాక వివిధ సంస్థలు అందించిన అవార్డులు అనేకం ఉన్నాయి.

ఇక గొల్లపూడి వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన వివాహం.. విద్యావంతులు, సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో 1961 నవంబర్‌ 11న గొల్లపూడి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.. సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్‌. వీరిలో శ్రీనివాస్‌ దర్శకుడిగా కెరీర్‌ కొనసాగాలనుకున్నారు. ఇప్పుడు తమిళ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న అజిత్‌ హీరోగా 1993లో ‘ప్రేమ పుస్తకం’ పేరుతో సినిమా ప్రారంభించారు. వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోవడం వల్ల శ్రీనివాస్‌ కన్నుమూశారు. అప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను గొల్లపూడి తీసుకొని పూర్తి చేశారు. ఆ తర్వాత తన కుమారుడి జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస్‌ అవార్డు పేరుతో జాతీయ స్థాయిలో ఉత్తమ నూతన దర్శకులకు అవార్డులు అందిస్తున్నారు. గొల్లపూడి ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజన్సీని నడుపుతున్నారు. నటుడిగా మారిన తర్వాత గొల్లపూడి రచనా వ్యాసంగానికి దూరమయ్యారనే చెప్పాలి. ఆయన నటించిన చివరి చిత్రం 2019లో వచ్చిన ‘జోడి’. అప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడి అదే సంవత్సరం డిసెంబర్‌ 12న 80 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.