Read more!

English | Telugu

నారాయ‌ణ‌మూర్తి ఇత‌రుల‌ సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే!

 

కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన 'నేర‌ము-శిక్ష' సినిమాతో జూనియ‌ర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించి, దాస‌రి నారాయ‌ణ‌రావు సినిమా 'సంగీత‌'తో హీరోగా మారిన న‌టుడు ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి. త‌నే హీరోగా న‌టిస్తూ డైరెక్ట‌ర్‌గా మారి, ఆయ‌న నిర్మించిన చిత్రం 'అర్ధ‌రాత్రి స్వ‌తంతం' ఒక సంచ‌ల‌నం. అప్ప‌ట్నుంచి సుమారు రెండు ద‌శాబ్దాల కాలంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను స్వ‌యంగా తీసి, పీపుల్స్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారాయ‌న‌. ఎర్ర‌సైన్యం, భూపోరాటం, అడ‌వి దివిటీలు, దండోరా, చీమ‌ల దండు, ద‌ళం, చీక‌టి సూర్యులు, అడ‌వి బిడ్డ‌లు లాంటి సినిమాలు ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిని తీసుకొచ్చాయి. సామాజిక అంశాల‌తో, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తో సినిమాలు తీస్తూ, ఆ బాట‌ను వ‌ద‌లకుండా, క‌మ‌ర్షియ‌ల్ హంగుల జోలికి పోకుండా ఒక నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్న అస‌లైన హీరో నారాయ‌ణ‌మూర్తి.

ఇత‌ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు తీస్తున్న సినిమాల్లో ఆయ‌న‌కు ముఖ్య పాత్ర‌లు చేయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌స్తున్నా, వాటిని సున్నితంగా తిర‌స్క‌రిస్తూ, త‌న సినిమాలేవో త‌ను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్ర‌స్తుత కాలంలో ఆయ‌న తీస్తున్న సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. అయినా ఆయ‌న త‌న బాట‌ను వీడ‌లేదు. బ‌య‌టి నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల సినిమాల్లో మంచి రెమ్యూన‌రేష‌న్‌తో క్యారెక్ట‌ర్లు ఆఫ‌ర్ చేస్తున్న ఆయ‌న ఎందుకు చేయ‌డం లేదు, ఆయ‌న‌కేమైనా తిక్కా.. అనుకొనేవాళ్లు చాలామందే ఉన్నారు.

"నామీదున్న అభిమానంతో చాలామంది నాకు త‌మ సినిమాల్లో ఆఫ‌ర్లు చేశారు. పూరి జగ‌న్నాథ్‌, క్రాంతి మాధ‌వ్ లాంటి చాలామంది గొప్ప గొప్ప ద‌ర్శ‌కులు ఈ వేషం మీరు చేస్తే బాగుంటుంద‌ని ఆఫ‌ర్ చేశారు. నేను సున్నితంగా తిర‌స్క‌రించాను. వారికి వంద‌నాలు. 'న‌న్ను క్ష‌మించండి' అని వారికి చెప్పాను. జూనియ‌ర్ ఆర్టిస్టుగా స్టార్ట‌య్యాను. 'అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం' నుంచి సొంత సినిమాలు తీసుకుంటూ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి ఫిలిమ్స్ అనే విధంగా పేరు తెచ్చుకున్న‌వాడ్ని. అలాంటిది బ‌య‌టి సినిమాల్లో వేరే పాత్ర‌లు చెయ్య‌డానికి నాకు మ‌న‌స్క‌రించ‌డం లేదు. అది త‌ప్పో, ఒప్పో ప‌క్క‌న‌పెట్టండి. ముందు నాకు మ‌న‌స్క‌రించ‌డం లేదు. ఏ డైరెక్ట‌రైనా నామీద ప్రేమ‌తో క్యారెక్ట‌ర్ ఇచ్చాడ‌నుకోండి. మ‌న‌స్క‌రించ‌కుండా న‌టిస్తే, ఎక్కువ టేకులు తీసుకుంటుంటే నామీద నాకే అస‌హ్యం వేస్తుంది క‌దా! నాతో సినిమా తియ్యాలంటే ఒక 'ఒమ‌ర్ ముఖ్తార్' లాంటి సినిమా తియ్యాలి. లేదంటే 'శంక‌రాభ‌ర‌ణం'లో జె.వి. సోమ‌యాజులు గారు వేసిన‌టువంటి క్యారెక్ట‌ర్ ఇవ్వాలి. మిగ‌తా క్యారెక్ట‌ర్లు చెయ్య‌డానికి నాకు ఎప్ప‌టికీ మ‌న‌స్క‌రించ‌దు." అని తేల్చి చెప్పేశారు నారాయ‌ణ‌మూర్తి.