Read more!

English | Telugu

మ‌ణిర‌త్నం 'అంజ‌లి' మూవీలో స‌సేమిరా న‌టించ‌న‌ని మొండికేసిన త‌రుణ్‌!

 

'భ‌క్త ప్ర‌హ్లాద' చిత్రంలో టైటిల్ రోల్ పోషించ‌డం ద్వారా బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మైన రోజార‌మ‌ణి, తొలి చిత్రంతోటే త‌న ముద్ర‌ను వేశారు. బాల‌న‌టిగా అనేక సినిమాలు చేసి, యుక్త‌వ‌య‌సు వ‌చ్చాక హీరోయిన్‌గా మారారామె. స‌హ‌న‌టుడు చ‌క్ర‌పాణితో వివాహం త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్తిచెప్పిన రోజార‌మ‌ణి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా అనేక‌మంది హీరోయిన్ల‌కు గాత్ర‌ధార‌ణ చేశారు. ఆమె కుమారుడు త‌రుణ్ కూడా త‌ల్లిబాట‌లోనే బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చి, టీనేజ్‌లో 'నువ్వే కావాలి' సినిమాతో హీరో అయ్యాడు.

అత‌ను బాలన‌టుడిగా న‌టించ‌గా పేరు తెచ్చిన సినిమాలో మ‌ణిర‌త్నం 'అంజ‌లి' ఒక‌టి. ఆ మూవీలో రేవతి, ర‌ఘువ‌ర‌న్ దంప‌తుల కొడుకు అర్జున్ క్యారెక్ట‌ర్‌లో సూప‌ర్బ్‌గా యాక్ట్ చేశాడ‌నే పేరు తెచ్చుకున్నాడు. అయితే మొద‌ట ఆ సినిమాలో న‌టించ‌నంటే న‌టించ‌న‌ని త‌రుణ్ తెగ గొడ‌వ పెట్టాడంట‌. ఒక ఇంట‌ర్వ్యూలో రోజార‌మ‌ణి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చిన్న‌ప్పుడే న‌టిగా మార‌డం వ‌ల్ల పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం, స్కూలుకు వెళ్లి చ‌దువుకోవ‌డం లాంటి ఆనందాల‌ను.. వెర‌సి బాల్యాన్ని కోల్పోయారు రోజార‌మ‌ణి. అందుకే త‌రుణ్‌కు ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌ని రోజార‌మ‌ణి దంప‌తులు భావించారు.

త‌రుణ్‌ను చూసి సినిమాల్లో చేర్పించ‌మ‌ని చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు. నేను, మావారు చ‌క్ర‌పాణి కూడా అంగీక‌రించ‌లేదు. చివ‌ర‌కు ఒత్తిళ్ల‌కు లొగిపోయి 'ముద్దుబిడ్డ' చిత్రానికి అంగీక‌రించాం. త‌రుణ్‌కు కూడా న‌టించ‌డం ఇష్టం లేనందున షూటింగ్‌కు వెళ్లాక నేను చేయ‌నంటే చేయ‌న‌ని మొండికేశాడు. షూటింగ్ లొకేష‌న్ నుంచి తిరిగి వ‌చ్చేశాడు." అని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత త‌రుణ్ న‌టించ‌డం గురించి ఆలోచించ‌డం మానేశారు.

"ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నంగారు తీయ‌బోయే 'అంజ‌లి' సినిమా కోసం మ‌మ్మ‌ల్ని ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అడిగారు. వాడికి న‌టించే ఉద్దేశం లేద‌ని చెప్పాం. ఆయ‌న ప‌ట్టుప‌ట్టి, మీరు ఓకే అంటే త‌రుణ్‌ను నేను ఒప్పిస్తాన‌న్నారు. విష‌యం విన్న త‌రుణ్ స‌సేమిరా చేయ‌న‌ని అన్నాడు. అతి బ‌ల‌వంతం మీద మ‌ణిర‌త్నంగారి ద‌గ్గ‌ర‌కు త‌రుణ్‌ను ఆ స‌హాయ ద‌ర్శ‌కుడు తీసుకెళ్ల‌డం, అక్క‌డ త‌రుణ్ ఓకే అన‌డం జ‌రిగింది. 'అంజ‌లి' చిత్రంలో న‌టించాక త‌రుణ్‌కు న‌ట‌న మీద ఆస‌క్తి పెరిగింది." అని వెల్ల‌డించారు రోజార‌మ‌ణి.