English | Telugu

పాట‌లో రాజ్య‌ల‌క్ష్మిని కౌగ‌లించుకోడానికి తంటాలుప‌డ్డ సురేశ్‌!

సురేశ్ న‌టించిన తొలి చిత్రం స‌మ‌తా ఆర్ట్స్ వారి 'జ‌గ‌మొండి'. శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీలో సురేశ్ సెకండ్ హీరో. అత‌ని జోడీగా 'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి నటించారు. "గుండెలో వున్న‌ది గొడ‌వ చేస్తున్న‌ది.." అనే పాట‌ను తొలిగా ఆ ఇద్ద‌రి మీద ఊటీలో చిత్రీక‌రించారు. సురేశ్ ఫ‌స్ట్ టైమ్‌ కెమెరా ముందు నిల్చున్న‌ది ఆ పాట చిత్రీక‌ర‌ణ‌తోనే. అంత‌కుముందు ఆయ‌న‌కు న‌ట‌న‌లో కానీ, నాట్యంలో కానీ ఎలాంటి అనుభ‌వం లేదు. పైగా రాజ్య‌ల‌క్ష్మి అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రం ద్వారా బాగా పాపుల‌ర్‌. త‌న‌కంటే సీనియ‌ర్ న‌టితో క‌లిసి పాట‌పాడుతూ, డాన్స్ చెయ్య‌డం అన‌గానే మొద‌ట్లో సురేశ్‌కు కొంచెం జంకు క‌లిగింది.

ఆ పాట‌లో ఆ ఇద్ద‌రి మీదా చిత్రీక‌రించిన మొద‌టి దృశ్యంలో.. సురేశ్ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి రాజ్య‌ల‌క్ష్మిని కౌగ‌లించుకోవాలి. ఆ దృశ్య చిత్రీక‌ర‌ణ‌కు ముందు డైరెక్ట‌ర్ వి. మ‌ధుసూద‌న‌రావు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివ‌రంగా చెప్పి రిహార్స‌ల్స్ చేయించారు. అయితే రిహార్స‌ల్స్‌లో మాత్రం రాజ్య‌ల‌క్ష్మిని సురేశ్ కౌగ‌లించుకోవ‌డం చెయ్య‌లేదు. మూవ్‌మెంట్స్ చూసుకొని మ‌ధుసూద‌న‌రావు 'టేక్' అన్నారు. సౌండ్ స్టార్ట్ అయింది. పాట వినిపిస్తోంది. ఆ పాట‌కు త‌గ్గ‌ట్టుగా పెదాలు క‌దుపుతూ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేశ్‌.

"ఏరా.. ఏమైందీ.. అంత‌దూరం ప‌రుగెత్తుకువెళ్లి ఆ అమ్మాయిని కౌగిలించుకోకుండా ఆగిపోయావేంటి?" అన‌డిగారు మ‌ధుసూద‌న‌రావు ఏ విష‌య‌మూ అర్థంగాక‌.

సురేశ్ ఏమ‌ని చెప్తాడు! అంత‌దాకా ఏ అమ్మాయి ఒంటిమీదా చెయ్యేసి ఎర‌గ‌డు. వాళ్ల ఇంట్లో ఆయ‌నొక్క‌డే సంతానం. ఆ కార‌ణంగా త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర డిసిప్లిన్డ్‌గా పెరిగాడు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఆ త‌ర‌హా చిలిపిప‌నులు చేసిన అనుభ‌వం లేదు. పైగా.. కెమెరామేన్‌, డైరెక్ట‌ర్‌, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవ‌డం అనేస‌రికి సురేశ్‌కు ఏదోలా అనిపించింది. ఏదో పెద్ద త‌ప్పు చేస్తున్న ఫీలింగ్ క‌లిగింది.

అలాగే ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. ప్ర‌తి టేకులోనూ సురేశ్ పాట‌కు త‌గ్గ‌ట్లుగా పెదాలు క‌ద‌ప‌క‌పోవ‌డ‌మో, ల‌య‌బ‌ద్ధంగా అడుగులేస్తూ ప‌రుగెత్త‌లేక‌పోవ‌డ‌మో, రాజ్య‌ల‌క్ష్మిని గ‌ట్టిగా కౌగిలించుకోక‌పోవ‌డ‌మో.. ఏదో ఒక‌టి జ‌రిగేది. ఒక టేక్‌లో అయితే పరుగెత్తుకొని వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని భ‌యం భ‌యంగా కౌగిలించుకున్నాడు. మ‌ధుసూద‌న‌రావుకు విసుగెత్తి, "గ‌ట్టిగా కౌగిలించుకోరా" అని కేక‌పెట్టారు. అయినా సురేశ్‌లో భ‌యంపోలేదు.

ఇక లాభంలేద‌ని ఆయ‌న "ఒరే టైమింగ్ ప్ర‌కారం ప‌రుగెత్త‌డం, పాట‌కు త‌గ్గ‌ట్టు లిప్ మూవ్‌మెంట్స్ ఇవ్వ‌డం, మొహంలో రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ ఆ అమ్మాయిని గ‌ట్టిగా కౌగిలించుకోవ‌డం.. ఇవ‌న్నీ ఎప్పుడు చేస్తావో చెప్పు.. అప్పుడు తీస్తాను షాటు" అన్నారు.

అన్ని టేకులు తింటూ షాట్ స‌రిగా చేయ‌లేక‌పోతున్నందుకు సురేశ్‌కు చాలా బాధ క‌లిగింది. చివ‌ర‌కు షూటింగ్ వ‌ద్దు.. ఏం వ‌ద్దు.. వ‌దిలేస్తే చాలు అనుకున్నాడు. సురేశ్ ప‌రిస్థితిని గ‌మ‌నించిన మ‌ధుసూద‌నరావు ధైర్యంచెప్పి, ఆయ‌న‌లో భ‌యాన్ని పోగొట్టి, ఎనిమిదో టేక్ తీసి, ఓకే చేశారు.

అంత‌వ‌ర‌కూ సినిమా డాన్స్ అంటే ఏముందిలే అనే చుల‌క‌న‌భావం సురేశ్‌లో ఉండేది. ఆ కార‌ణంగానే ఆయ‌న మొద‌ట్లో పెద్ద‌గా ఏకాగ్ర‌త చూప‌లేదు. ఎప్పుడైతే త‌ను ఎక్కువ టేకులు తిన్నాడో అప్పుడ‌ర్థ‌మైంది, డాన్స్ చెయ్య‌డం ఎంత క‌ష్ట‌మో!