Read more!

English | Telugu

టీజ్ చేసిన‌ కృష్ణ‌.. దండం పెట్టేసిన‌ అల్లు రామ‌లింగ‌య్య‌!

 

మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్ ప‌దో ఫ్లోర్‌లో "చంద‌మామ‌తో బిళ్లంగోడు ఆడిన‌ట్లు దిక్కుల‌న్నీ అదిరిప‌డ్డ‌వి.. అరెరె రెరెరెరే చుక్క‌ల‌న్నీ చెదిరిప‌డ్డ‌వి.." అంటూ పాట వినిపిస్తోంది. కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌, గీత‌, జ్యోతిల‌క్ష్మిల‌కు చేయాల్సిన మూవ్‌మెంట్‌ను వివ‌రిస్తున్నారు కొరియోగ్రాఫ‌ర్ శ్రీ‌ను. ఇంత‌లో అల్లు రామ‌లింగ‌య్య సెట్‌లోకి వ‌చ్చారు. లాల్చీ ధ‌రించి, భుజంమీద కండువా వేసుకొని, మంచి యంగ్ గెట‌ప్‌లో ఠీవిగా న‌డ‌చివ‌స్తున్న అల్లును చూసి.. "ఏమిటీ ప్రేమాభిషేకం గెట‌ప్‌. పాపారాయుడి పోజు కొట్టుకుంటూ వ‌స్తున్నారు. హీరో అవుదామ‌ని ట్రై చేస్తున్నారా ఏంటి? నేనిప్పుడే రామారావు, నాగేశ్వ‌ర‌రావు గార్ల‌కు చెప్తాను." అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు కృష్ణ‌.

"అయ్యా మీరు హీరోలు, మేం క‌మెడియ‌న్స్‌. సినిమాల్లో ఎలాగూ ఏడిపిస్తారు. బ‌య‌టైనా మ‌మ్మ‌ల్ని మామూలుగా ఉండ‌నియ్యండ‌య్యా.." అంటూ మందు కొట్టిన‌వాడిలా, మ‌త్తు ఎక్కుతున్న‌వాడిలా న‌టిస్తూ మాట్లాడారు.

అక్క‌డ సెట్ లైటింగ్ అరేంజ్‌మెంట్స్‌ను చెక్ చేస్తున్న డైరెక్ట‌ర్ పి. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, "ఏమండీ రామ‌లింగ‌య్య‌గారూ.. మీ షాట్ ఇంకా అర‌గంట త‌ర్వాత తీస్తాం. ఇప్ప‌ట్నుంచే తాగుబోతు మూడ్‌లో మీరు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. షాట్ తీసే ముందు మీకు చెప్తాను. అప్పుడు తాగుబోతు మూడ్‌లోకి వ‌ద్దురుగానీ." అన్నారు.

వెంట‌నే కృష్ణ అందుకొని, "ఏమిటీ.. ఈయ‌న తాగుబోతు మూడ్‌లో సాంగ్ పాడ‌తారా ఇప్పుడు మీరు తీసే షాట్‌లో? అన‌డిగారు.

"ఈ సినిమాలో ఈయ‌న‌కు అమ్మాయిలంటే భ‌లే మోజు. క‌నిపించిన ప్ర‌తి అమ్మాయి వెంటా ప‌డుతూ ఉంటాడు. ఎంత‌మంది అమ్మాయిల ద‌గ్గ‌ర‌కు పెళ్లిచూపుల‌కు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదుర‌వుతుంటుంది. ఓసారి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లిచూపుల‌క‌ని బ‌య‌ల‌దేర‌బోతూ ఉంటే, 'అయ్యా మీరు ఆ అమ్మాయిని పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్ల‌కూడ‌దు.' అని అల్లు రామ‌లింగ‌య్య ఫ్రెండ్ ఒకాయ‌న ఆపుతాడు. 'ఏమిట‌య్యా నాకు ఇప్పుడు ఏం త‌క్కువ‌య్యింద‌ని.' అని రామ‌లింగ‌య్య రెచ్చిపోతాడు. 'బాబూ.. ఆ అమ్మాయి త‌ల్లిని 20 సంవ‌త్స‌రాల క్రితం మీరు పెళ్లిచూపులంటూ వెళ్లి చూశారు. క‌నుక ఇప్పుడు ఈ అమ్మాయి మీకు కూతురు వ‌ర‌స అవుతుంది. క‌నుక మీరు వెళ్ల‌కూడ‌దు.' అని ఆయ‌న చెప్పేస‌రికి, 'ఇదీ నిజ‌మే' అని ఆగిపోతాడు. అలాగే గీత‌ను ల‌వ్ చేస్తాడు. గీత పోలీసాఫీస‌ర్ అయిన మిమ్మ‌ల్ని ప్రేమిస్తోంద‌ని తెలిసి, భ‌య‌ప‌డి ఆ ప్ర‌య‌త్నం మానేస్తాడు. ఇలా ర‌క‌ర‌కాలుగా స‌ర‌దాగా సాగే ఈయ‌న పాత్ర ఈరోజు తీసే సాంగ్‌లో 'మ‌న‌సు గ‌తి ఇంతే అంటూ' మందు చేత్తో ప‌ట్టుకొని బాధ‌ప‌డే బిట్స్ తీయాలి. ఆ త‌ర్వాత డాన్స్‌లో జ్యోతిల‌క్ష్మి పోజు చూసి 'భ‌లేమంచి పోజు ఖ‌రీదైన పోజు' అంటూ ఆమె వెంట‌ప‌డే షాట్స్ తియ్యాలి." అని వివ‌రించారు చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.

"మొత్తానికి ఈ సినిమాలో పాట పాడ‌తార‌న్న మాట." అన్నారు రామ‌లింగ‌య్య‌తో కృష్ణ‌. "ఈ పాట‌లోని బిట్‌లే కాకుండా రామ‌లింగ‌య్య‌, గీత‌ల‌పై ఓ పాట తియ్యాల‌నుకుంటున్నామండీ అన్నారు." అక్క‌డే ఉన్న‌ చిత్ర స‌మ‌ర్ప‌కులు ఎన్‌.వి. సుబ్బ‌రాజు.

"ఓహో అదన్న మాట సంగ‌తి. అందుకే ఇంత పోజుకొడుతూ సెట్లోకి వ‌చ్చారు." అని అల్లుని చూపిస్తూ కృష్ణ‌ అనేస‌రికి, "నాయ‌నా కృష్ణా.. ఇక ఆ విష‌యం వ‌దిలెయ్‌. ప‌డ‌క ప‌డ‌క ఈ గెట‌ప్‌లో నీ క‌ళ్ల‌లోనే ప‌డ్డాను." అన్నారు రామ‌లింగ‌య్య‌.

"స‌రే మీరు కాసేపు ప‌క్క‌న ఉండండి. ఈ షాట్‌లో మీరు లేరు. షాట్‌లో మీరు లేకుండా ఇప్పుడు ఇక్క‌డికి ఎందుకొచ్చారు. అన‌వ‌స‌రంగా మ‌మ్మ‌ల్ని న‌వ్విస్తూ టైమ్ వేస్ట్ చేయించ‌డానికా?" అని మ‌ళ్లీ అడిగారు కృష్ణ‌.

"ఏడీ ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎక్క‌డ‌? న‌న్ను ర‌మ్మ‌న్నాడు. షాట్ రెడీ అన్నాడు. అత‌ను ఏడండీ." అంటూ సెట్ అంతా వెతుకుతున్నారు.

"మీరు అడుగుతున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అడుగో ఫ్లోర్ బ‌య‌ట నుంచి సెట్‌లోకి వ‌స్తున్నాడు చూడండి." అని కృష్ణ చెప్పారు.

రామ‌లింగ‌య్య సీరియ‌స్‌గా, "ఏమ‌య్యా షాట్ రెడీ అంటూ వ‌చ్చావు. ఇంకా రెడీ అవ‌లేదంట క‌దా." అని నిల‌దీసి అడిగారు.

"ఆ విష‌య‌మే మీతో చెపుదామ‌ని బ‌య‌ట‌కు వెళ్లి మీకోసం వెతుకుతున్నానండీ." అన్నాడ‌త‌ను.

"నేను ఇక్క‌డే ఉన్నాను క‌దా.." అని రామ‌లింగ‌య్య ఆశ్చ‌ర్యంగా చూశారు.

"ఇంత‌మంది ఆర్టిస్టుల మ‌ధ్య‌లో మీరు క‌నిపించ‌లేదేమో.." అని జోక్ చేశారు ఆప‌రేటివ్ కెమెరామ‌న్ ల‌క్ష్మ‌ణ్ గోరే.

ఇదంతా 'ప‌గ‌బ‌ట్టిన సింహం' సెట్స్ మీద నిజంగా జరిగిన ఓ స‌ర‌దా స‌న్నివేశం.

క‌వ‌ల సోద‌రులుగా కృష్ణ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌, గీత, ప్ర‌భ‌ హీరోయిన్లు. స‌త్య‌నారాయ‌ణ‌, అల్లు రామ‌లింగ‌య్య‌, సార‌థి, నాగ‌భూష‌ణం, రావు గోపాల‌రావు, పుష్ప‌ల‌త‌, జ్యోతిల‌క్ష్మి, త్యాగ‌రాజు, భీమ‌రాజు కీల‌క పాత్ర‌ధారులు. సత్యం సంగీతం, ఎస్‌.ఎస్‌. లాల్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకు మాట‌లు మోదుకూరి జాన్స‌న్‌, పాట‌లు వేటూరి రాశారు. నిజానికి టైటిల్స్‌లో మోదుకూరి జాన్స‌న్ ఒక్క‌రి పేరే వేసినా, ఆయ‌న కంటే ఎక్కువ‌గా ఈ సినిమాకు డైలాగ్స్ రాసింది ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌. 1982 సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమా విడుద‌లైంది.