English | Telugu

సీన్ స‌రిగా చెయ్య‌ట్లేద‌ని ర‌జ‌నీకాంత్‌ను బాల‌చంద‌ర్ కొట్టారు!

న‌టునిగా ర‌జ‌నీకాంత్‌కు గురువు లెజండ‌రీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అపూర్వ రాగంగ‌ళ్ (1975) మూవీతోటే న‌టునిగా తెర‌పై అడుగుపెట్టారు ర‌జ‌నీ. అంతేకాదు, బాల‌చంద‌ర్ సినిమాల‌తోటే ర‌జ‌నీకి ఎంతో పేరు వ‌చ్చింది. బాల‌చంద‌ర్‌కు సంతృప్తి క‌లిగేలా న‌టించాలంటే చాలా శ్ర‌ద్ధ‌గా కృషి చేయాలి. న‌ట‌న‌లో ఏమాత్రం చిన్న‌లోటు క‌నిపించినా ఆయ‌న‌కు చాలా చిరాకు, కోపం వ‌స్తాయి. బాగా న‌టిస్తే మాత్రం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ "వెరీగుడ్" అంటారు.

అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి త‌మిళంలో తొలిసారి క‌థానాయిక‌గా ఆయ‌న ద‌ర్శ‌క‌తంలోనే న‌టించారు. అప్పుడు ఆమె వ‌య‌సు ప‌ద‌మూడేళ్లు. ఆ చిత్రం పేరు 'మూండ్రు ముడిచ్చు' (1976). (తెలుగులో కె. విశ్వ‌నాథ్ రూపొందించిన‌ 'ఓ సీత క‌థ' (1973) ఆ చిత్రానికి ఆధారం). అందులో ర‌జ‌నీకాంత్ కూడా ముఖ్య పాత్ర‌ధారి ధ‌రించారు.

త‌మ ఇద్ద‌రిలో ఎవ‌రు ఎన్నిసార్లు న‌ట‌న‌కు బాల‌చంద‌ర్ చేత "వెరీ గుడ్" అనిపించుకుంటార‌నే పోటీ పెట్టుకున్నారు శ్రీ‌దేవి, ర‌జ‌నీ. ఆ పోటీలో శ్రీ‌దేవి గెలిచారు. అయితే బాల‌చంద‌ర్‌కు ఎంత కోపం అంటే ర‌జ‌నీకాంత్ ఒక స‌న్నివేశంలో బాగా న‌టించ‌లేద‌ని ఆయ‌న‌ను కొట్టేశారు కూడా! శ్రీ‌దేవి కూడా త‌క్కువ తిన‌లేదు. అందులో ఓ స‌న్నివేశానికి 13 టేకులు తీసుకున్నారు. 14వ టేకును డైరెక్ట‌ర్ ఓకే చేశారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడూ శ్రీ‌దేవి ఓ సీన్‌కు అన్ని టేకులు తీసుకున్న సంద‌ర్భం రాలేదు. ఈ విష‌యాల‌ను ఓ సంద‌ర్భంలో శ్రీ‌దేవి స్వ‌యంగా చెప్పారు. ఈ సినిమాలో ర‌జ‌నీ కంటే శ్రీ‌దేవికే ఎక్కువ పారితోషికం ఇవ్వ‌డం ఇంకో విశేషం.