Read more!

English | Telugu

చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో గొల్ల‌పూడి ఎలా న‌టుడ‌య్యారో తెలుసా?

 

న‌టుడు కాక‌ముందు గొల్ల‌పూడి మారుతీరావు ర‌చ‌యిత‌గా సుప్ర‌సిద్ధులు. చిరంజీవి, మాధ‌వి జంట‌గా న‌టించిన‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాతో వెండితెర‌పై అడుగుపెట్టి, న‌టుడిగా తొలి సినిమాలోనే ప్రేక్ష‌కుల నుంచి అభినంద‌న‌లు అందుకున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ ఆయ‌న పాత్ర‌మీద పెట్టిందే. ఆ సినిమాలో న‌టించ‌క ముందే రంగ‌స్థ‌లంపై ఆయ‌న చాలా నాటిక‌లు, నాట‌కాల్లో న‌టించారు. విద్యార్థి జీవితంలో స‌గ‌భాగం స్టేజిమీదే గ‌డిపారు. నాట‌కాలు రాయ‌క‌ముందు ఆయ‌న న‌టుడే. త‌ర్వాతే ర‌చ‌యిత‌య్యారు.

సినిమాల్లో ర‌చ‌యిత‌గా అడుగుపెట్టాక ఆయ‌న‌లోని న‌టుడు వెన‌క‌ప‌డ్డాడు. జీవితంలో స‌గం ఉద్యోగానికీ, త‌క్కిన స‌గం సినిమా ర‌చ‌న‌కీ అంకితం అయిపోయింది. ఇంత‌కీ ఉన్న‌ట్లుండి ఆయ‌న‌ 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో కీల‌క పాత్ర‌లో ఎలా న‌టించారు?  ప్ర‌తాప్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె. రాఘ‌వ తీసిన 'త‌రంగిణి' సినిమా క‌థ గొల్ల‌పూడి రాసిందే. త‌న‌కున్న నాట‌కానుభ‌వంతో స్క్రిప్టు చ‌దివేట‌ప్పుడు, పాత్ర‌ప‌రంగా చ‌ద‌వ‌డం ఆయ‌న‌కున్న అల‌వాటు. అందులోని ఓ పాత్ర తీరును చెప్పిన‌ప్పుడు, చ‌దివిన‌ప్పుడూ 'ఈ వేషం మీరు వెయ్యాలి' అన్నారు రాఘ‌వ‌. న‌వ్వేసి ఊరుకున్నారు గొల్ల‌పూడి. కొన్ని కార‌ణాల వ‌ల్ల 'త‌రంగిణి' షూటింగ్ వాయిదా ప‌డింది.

'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' షూటింగ్‌కు ముందు గొల్ల‌పూడి ఇంటికి డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ వ‌చ్చారు. 'మీరొక వేషం వెయ్యాలి' అన్నారు. 'అలాగే, చూద్దాం' అన్నారు గొల్ల‌పూడి. వెంట‌నే రాఘ‌వ‌కు ఫోన్‌చేసి, 'మారుతీరావు గారు ఒప్పుకున్నారు' అని చెప్పేశారు రామ‌కృష్ణ‌. సుబ్బారావు అనే ముఖ్య‌పాత్ర త‌న‌చేత ధ‌రింప‌చెయ్య‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు తీర్మానించుకున్నార‌ని గొల్ల‌పూడికి అర్థ‌మైంది. టైటిల్ రోల్‌, కొత్త ద‌ర్శ‌కుడు (కోడి రామ‌కృష్ణ‌), ఒక ముఖ్య‌పాత్ర‌లో కొత్త‌న‌టుడు.. గొల్ల‌పూడికి భ‌య‌మేసింది. కానీ వాళ్లిద్ద‌రికీ ఏ భ‌య‌మూ లేదు. అప్పుడు గొల్ల‌పూడి, 'వేస్తాను. మీకు ఎప్పుడు కానీ, ఏ క్ష‌ణాన కానీ తృప్తిగా క‌నిపించ‌క‌పోయినా.. న‌న్ను మార్చేసి, ఇంకొక‌ర్ని పెట్టుకోండి' అన్నారు. వాళ్లు కూడా 'మొహ‌మాట‌ప‌డం' అని చెప్పారు.

అట్లా 'ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య' సినిమాలో సుబ్బారావు అనే ప్ర‌ధాన పాత్ర పోషించి, ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల మెప్పును పొందారు గొల్ల‌పూడి. ఆ సినిమా చూసిన క్రాంతికుమార్‌కు గొల్ల‌పూడి న‌ట‌న తెగ న‌చ్చేసి, త‌ను అప్పుడే తీస్తున్న 'ఇది పెళ్లంటారా?'  సినిమాలో మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ త‌ర్వాత కాలంలో న‌టుడిగా య‌మ బిజీ అయిపోయి, ర‌చ‌యిత‌గా త‌క్కువ సినిమాల‌కు రాశారు గొల్ల‌పూడి మారుతీరావు.