Read more!

English | Telugu

అజ్ఞాతంలోకి వెళ్లిన తోడ‌ల్లుడి కుటుంబానికి ఆశ్ర‌య‌మిచ్చిన ఘంట‌సాల‌!

 

ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు తోడ‌ల్లుడు ఆమంచి న‌ర‌సింహారావు క‌ర‌డుక‌ట్టిన‌ క‌మ్యూనిస్ట్‌. తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా జ‌రుగుతున్న రోజుల్లో ఆయ‌న‌తో పాటు క‌మ్యూనిస్ట్ నాయ‌కులు అంద‌రి మీదా నిర్బంధం పెరిగింది. షూట్ ఎట్ సైట్ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అంద‌రూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. న‌ర‌సింహారావు భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు దిక్కు తోచ‌లేదు. వాళ్ల‌ను మ‌ద్రాస్‌లోని త‌న ఇంటికి తీసుకువ‌చ్చి ఆశ్ర‌య‌మిచ్చారు ఘంట‌సాల‌. న‌ర‌సింహారావు కుటుంబ స‌భ్యులు ఘంట‌సాల ఇంట్లో ఆశ్ర‌యం పొందుతున్న విష‌యం తెలుసుకున్న సీఐడీ అధికారులు న‌ర‌సింహారావు ఆచూకీ చెప్పాల్సిందిగా ఘంట‌సాల‌ను ప్ర‌శ్నించారు.

"మా ఇంట్లో ఉన్న‌ది మా వ‌దిన‌గారు, ఆమె పిల్ల‌లు. బంధువుల్ని మా ఇంట్లో ఉంచుకోకూడ‌ద‌ని చ‌ట్టం ఏమీ లేదుగా" అని జ‌వాబిచ్చారు ఘంట‌సాల‌. ఆయ‌న‌ను ఎన్ని రకాలుగా అధికారులు ప్ర‌శ్నించినా మ‌రో స‌మాధానం ల‌భించ‌లేదు.

"ఘంట‌సాల గారూ! మీరు పేరు ప్ర‌తిష్ఠ‌లు ఉన్న‌వారు. మీ పాటంటే మాక్కూడా ఎంతో అభిమానం. కాబ‌ట్టి మిమ్మ‌ల్ని ఇంత స‌హ‌నంగా అడుగుతున్నాం. దాన్ని ఆస‌రాగా తీసుకోకండి. అత‌డు క‌నిపిస్తే కాల్చెయ్య‌మ‌ని ఉత్త‌ర్వులున్నాయి. తెలిసి కూడా ఆచూకీ చెప్ప‌కుండా దాచ‌డం నేరం. మీ ఇంటిపై పోలీసు నిఘా ఉంది. మిమ్మ‌ల్ని అరెస్టు చేసే అవ‌స‌రం మాకు రానివ్వ‌కండి" అని హెచ్చ‌రించి వెళ్లారు అధికారులు.

ఘంట‌సాల భ‌య‌ప‌డ‌లేదు, వారి హెచ్చ‌రిక‌ల్ని ల‌క్ష్య‌పెట్ట‌లేదు. న‌ర‌సింహారావు మీద కేసుల‌న్నీ కొట్టేసి, ఆయ‌న తిరిగి ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఘంట‌సాల‌. ఆయ‌న‌లోని దేశ‌భ‌క్తికీ, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల విష‌యంలో ఆయ‌న‌కు ఉన్న అపార గౌర‌వానికి ఈ ఘ‌ట‌న ఓ చిన్న ఉదాహ‌ర‌ణ‌.

ఆధారం: 'నేనెరిగిన నాన్న‌గారు' పుస్త‌కం