Read more!

English | Telugu

అభిమాన సంఘాల విష‌యంలో చంద్ర‌మోహ‌న్ అభిప్రాయం ఇదే!

 

ఇవాళ అభిమాన సంఘాలు ఉండ‌ని హీరోలు లేరు. స్టార్ల‌కే కాదు, చిన్న చిన్న హీరోల‌కు కూడా అభిమాన సంఘాలు త‌యారైపోతుంటాయి. తెలుగు స్టార్ హీరోల అభిమానులే కాదు, మిగతా భాష‌ల‌కు చెందిన స్టార్ల అభిమానులు కూడా అనేక‌మంది సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇది నాణేనికి ఓ వైపు. మ‌రోవైపు వేర్వేరు హీరోల అభిమానుల మ‌ధ్య శ‌త్రుత్వం న‌డుస్తూ ఉంటుంద‌నేది ఎన్టీఆర్‌, కృష్ణ కాలం నుంచి మ‌నం గ‌మ‌నిస్తున్నాం. 

ఒక స్టార్ సినిమా రిలీజైతే, ఆ హీరో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటూ ఉంటే, మ‌రో స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాపై కావాల్సినంత నెగ‌టివిటీని వ్యాప్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. వాల్‌పోస్ట‌ర్ల యుగంలో అయితే ఒక హీరో సినిమా పోస్ట‌ర్ల‌పై మ‌రో హీరో ఫ్యాన్స్ పిడ‌క‌లు కొట్ట‌డం గ్రామాల్లో నిత్యం క‌నిపించే స‌న్నివేశం. ఇప్పుడు సోష‌ల్ మీడియా కాలంలో ఒక హీరోపై మ‌రో హీరో ఫ్యాన్స్ దుమ్మెత్తిపోయ‌డం, అస‌భ్య‌క‌రంగా కామెంట్లు పెట్ట‌డం చూస్తున్నాం. దీంతో త‌ర‌చూ ఆయా స్టార్ల ఫ్యాన్స్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్స్ న‌డుస్తుంటాయి. క‌లెక్ష‌న్ల విష‌యంలో భిన్న హీరోల‌ ఫ్యాన్స్ త‌ర‌చూ పోట్లాడుకుంటూ ఉంటున్నారు.

ఇలాంటి ఫ్యాన్స్ అసోసియేష‌న్ల‌పై ఒక‌సారి సీనియ‌ర్ యాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ స్పందించారు. అభిమానుల‌పై త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. చంద్ర‌మోహ‌న్ హీరోగా న‌టిస్తున్న కాలంలో ఓ అభిమాని, "నిర్మాత‌లు ఎన్నో ల‌క్ష‌ల పెట్టుబ‌డితో తీసిన చిత్రాల బాగోగులు నిర్ణ‌యించేది ప్రేక్ష‌కులే కానీ, అభిమాన సంఘాలు కాదు. కానీ ఒక్కోచోట ఈ అభిమాన సంఘాల దురాగ‌తాలు విప‌రీతంగా ఉంటున్నాయి. ఈ విష‌యంలో మీ అభిప్రాయం?" అని అడిగాడు.

దానికి చంద్ర‌మోహ‌న్‌, "మీరు చెప్పింది నిజ‌మే. అటువంటి అభిమాన సంఘాల‌ను ఆయా న‌టులు కూడా ప్రోత్స‌హించ‌కూడ‌దు. కానీ అది జ‌రిగే ప‌ని కాదు క‌దా!" అని జ‌వాబిచ్చారు. తను న‌టించిన చిత్రాల్లో 'ప‌ద‌హారేళ్ల వ‌య‌సు'లోని కుంటివాని పాత్ర త‌న‌కు బాగా క్లిష్టంగా అనిపించింద‌ని ఆయ‌న అన్నారు. "ఆ చిత్రానికి మూల‌మైన త‌మిళ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ గోచీ క‌ట్టుకొని న‌టించారు. తెలుగులో తీస్తున్న‌ప్పుడు నిర్మాత‌ల కంటే ముందుగా నేనే గోచీ క‌ట్టుకొని చేస్తాన‌న్నాను" అని ఆయ‌న చెప్పారు.