Read more!

English | Telugu

మంజుల ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. ఎవ‌రికైనా గుండెలు ద్ర‌వించ‌కుండా ఉండ‌వు!

 

అల‌నాటి గ్లామ‌ర్ హీరోయిన్ మంజుల ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డి, కొన్ని రోజుల త‌ర్వాత అనూహ్యంగా ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్‌తో మృతి చెందారు. ఆమె మృతి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది. ఆమె సీనియ‌ర్ త‌మిళ న‌టుడు విజ‌య్‌కుమార్ భార్య‌. 1977లో వారు వివాహం చేసుకున్నారు. విజ‌య్‌కుమార్‌కు ఆమె రెండో భార్య‌. అప్ప‌టికే ఆయ‌న‌కు మొద‌టి భార్య ద్వారా ముగ్గురు పిల్ల‌లు. వారిలో అరుణ్ విజ‌య్ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా విజ‌య్‌కుమార్ ద్వారా మంజుల‌కు ముగ్గురు కుమార్తెలు వనిత‌, ప్రీతి, శ్రీ‌దేవి పుట్టారు. 

2013లో చెన్నైలోని పేరుపొందిన శ్రీ రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో జూలై 23న మంజుల తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి దారితీసిన కార‌ణాల‌ను పెద్ద కుమార్తె వ‌నితా విజ‌య్‌కుమార్ వెల్ల‌డించారు. 

ఒక‌రోజు ఇంట్లో మంజుల కింద‌ప‌డ్డారు. అప్పుడు క‌ణ‌త పైన చిన్న దెబ్బ త‌గిలి వాచింది. ఆయింట్‌మెంట్ రాసి, రెస్ట్ తీసుకుంటే త‌గ్గిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆమె ప‌డిన‌ప్పుడు క‌డుపులో బ‌లంగా దెబ్బ త‌గిలింది. అది బ‌య‌ట‌కు తెలీలేదు. అందుక‌ని హాస్పిట‌ల్‌కు వెళ్లి ఎలాంటి టెస్ట్ చేయించుకోలేదు. నెల రోజులు గ‌డిచాక క‌డుపు లోప‌ల బ్లీడింగ్ అయ్యింది. ర‌క్తం గడ్డ క‌ట్టింది. దానివ‌ల్ల కిడ్నీల‌పై ఒత్తిడిప‌డింది. ఫ‌లితంగా మంజుల విప‌రీత‌మైన నొప్పి అనుభ‌వించారు. 

అప్పుడు అమ్మ‌ను శ్రీ రామ‌చంద్ర‌ హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు వ‌నిత‌. డాక్ట‌ర్లు మంజుల‌కు ప‌లు టెస్టులు నిర్వ‌హించారు. వాటి ఫ‌లితాలు వ‌చ్చాక‌, 72 గంట‌ల్లో మీ అమ్మ చ‌నిపోతుంద‌ని వ‌నిత‌కు డాక్ట‌ర్ చెప్పేశారు. ఆ 72 గంట‌ల్లో ఏమేం జ‌రుగుతుందో వెల్ల‌డించారు. వ‌నిత‌కు డాక్ట‌ర్ ఏం చెప్తున్నారో కొద్ది క్ష‌ణాల దాకా అర్థం కాలేదు. ఆమెకు త‌లంతా గిర్రున తిరుగుతున్న‌ట్లు అనిపించింది. అమ్మ మ‌రో మూడు రోజుల్లో చ‌నిపోతుంద‌నే వార్త‌ను డాక్ట‌ర్ మొద‌ట‌ ఆమెకే చెప్పారు మ‌రి! ఆ వాస్త‌వాన్ని జీర్ణించుకోవ‌డం త‌న‌కే క‌ష్టంగా ఉందే.. దాన్ని తండ్రికి, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌కు ఎలా చెప్పాలి?

కూతురు డాక్ట‌ర్‌తో మాట్లాడుతుంటే కాస్త దూరంలో ఉన్న మంజుల‌కు త‌న ప‌రిస్థితి ఏమిట‌నేది అర్థ‌మైపోయింది. ఆమె చెవులు చాలా షార్ప్‌. వారి మాట‌లు ఆమె చెవిన ప‌డ్డాయి. "వ‌నితా నీ మాట‌లు నాకు వినిపిస్తున్నాయ్" అని ఆమె అక్క‌డ్నుంచే కేక వేశారు. ఆమెను హాస్పిట‌ల్‌లో ఐసీయూ వార్డులో అడ్మిట్ చేశారు.

క్ర‌మ‌క్ర‌మంగా మంజుల‌కు మ‌తిస్థిమితం త‌ప్పుతూ వ‌చ్చింది. తాను హాస్పిట‌ల్లో ఉన్న విష‌యం కూడా ఆమె మ‌ర్చిపోతూ వ‌చ్చారు. కాసేపు ఇంట్లో ఉన్నాన‌నుకొనేవారు. చెప్పిన విష‌యం ప‌ది నిమిషాల్లో మ‌ర్చిపోయేవారు. భ‌ర్త‌, కుమార్తెలు అంద‌రూ హాస్పిట‌ల్‌లో ఉన్నారు. మూడో రోజు.. 23 జూలై 2013.. మంజుల ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా క్షీణించింది. రెండు రోజులు అక్క‌డే ఉండ‌టంతో, ఆరోజు ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకొన‌మ‌ని వ‌నిత‌కు చెప్పారు విజ‌య్‌కుమార్‌. దాంతో ఆమె ఇంటికి వెళ్లింది. ఈలోపు ఎవ‌రు క‌నిపించినా "వ‌నితా" అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు మంజుల‌. తండ్రి ఆమెకు ఫోన్ చేశారు.. "ఏ క్ష‌ణంలోనైనా అమ్మ మ‌న‌ల్ని వ‌దిలిపోవ‌చ్చు.. నువ్వు రా" అని చెప్పారు.

ఆరోజు వ‌నిత హాస్పిట‌ల్‌కు వ‌చ్చేట‌ప్పుడు ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంది. అది త‌ప్పించుకొని వ‌చ్చేస‌రికి మంజుల ఆఖ‌రి క్ష‌ణాల్లో ఉన్నారు. ముఖ‌మంతా ప‌సుపు రంగులోకి మారిపోయింది. క‌నుగుడ్లు కింద‌కు వాలిపోయాయి. ఒక్క గుండె మాత్రం కొట్టుకుంటోంది. వ‌నిత వ‌చ్చిన వెంట‌నే ఐసీయూ రూమ్‌లో ఉన్న‌వాళ్లంతా లేచి, బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఆ రూమ్‌లో మిగిలింది.. మంజుల‌, విజ‌య్‌కుమార్‌, వ‌నిత‌. అమ్మ చేతిని త‌న చేతిలోకి తీసుకున్న వ‌నిత‌.. "అమ్మా లుక్ ఎట్ మి అమ్మా.. వ‌నిత అమ్మా" అంది వ‌నిత‌. వ‌నితా అన్న పిలుపు విన‌గానే కింద‌కు వాల్చిన క‌ళ్లను ఒక్క క్ష‌ణం పైకిలేపి, వ‌నిత వంక చూశారు మంజుల‌. ఆ క్ష‌ణంలోనే మానిట‌ర్‌లో హార్ట్ రేటింగ్, ప‌ల్స్ రేటింగ్‌ ప‌డిపోవ‌డం చూసింది వ‌నిత‌.. వెంట‌నే "డాడీ.. డాడీ.. న‌ర్సును పిల‌వండి" అంటూనే ఉంది.. ప‌ది సెక‌న్ల‌లోనే మంజుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. త‌న తొలి బిడ్డ చేతుల్లోనే ఆమె క‌న్నుమూశారు.