English | Telugu

టాలీవుడ్‌లో 'ఫ్రీమేక్' అయిన కొరియ‌న్ ఫిలిమ్స్ ఏవో తెలుసా?

సౌత్ కొరియ‌న్ సినిమాల‌కు గ‌త ద‌శాబ్ద కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ఒక‌ప్పుడు ఆ దేశానికే ప‌రిమిత‌మై ఉండే ఆ సినిమాలు ఇవాళ అంత‌ర్జాతీయంగా మార్కెట్ సంపాదించుకొని, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లాభాల పంట పండిస్తున్నాయి. ఆ భాష‌లో సూప‌ర్ హిట్ట‌యిన ప‌లు సినిమాలు ఇత‌ర భాష‌ల్లో రీమేక్ అవుతున్నాయి. మ‌న తెలుగువాళ్లు కూడా కొరియ‌న్ సినిమాల‌పై చాలా కాలంగా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే వారెక్కువ‌గా రీమేక్‌లు కాకుండా కాపీ చేయ‌డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వ‌చ్చారు. కొరియ‌న్ సినిమాల్లోని యాక్ష‌న్ సీన్ల‌నో, డ్రామా సీన్ల‌నో మ‌క్కీకి మ‌క్కీ దింపేసిన సంద‌ర్భాలున్నాయి. అల్ల‌రి న‌రేశ్ సినిమా 'జేమ్స్‌బాండ్‌.. నేను కాదు నా పెళ్లాం' అందుకు నిద‌ర్శ‌నం. ఫేమ‌స్ కొరియ‌న్ ఫిల్మ్ 'మై వైఫ్ ఈజ్ ఎ గ్యాంగ్‌స్ట‌ర్‌'ను చాలావ‌ర‌కు ఆ మూవీలో దించేశారు. కానీ అది అఫిషియ‌ల్ రీమేక్ కాదు.

ఇదివ‌ర‌కు కూడా తెలుగులో కొన్ని కొరియ‌న్ ఫిలిమ్స్‌ను రీమేక్ చేశారు. తార‌క‌ర‌త్న ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ర‌విబాబు రూపొందించిన 'అమ‌రావ‌తి' (2009) మూవీ కొరియ‌న్ ఫిల్మ్ 'హెచ్' (2002)కు రీమేక్‌. కెరీర్‌లో ఆరంభంలో నానికి బాగా ప్ల‌స్స‌యిన చిత్రాల్లో ఒక‌టైన 'పిల్ల జ‌మీందార్' (2011) కూడా 'ఎ మిలియ‌నీర్స్ ఫ‌స్ట్ ల‌వ్' (2006) అనే కొరియ‌న్ ఫిల్మ్ ఆధారంగా తీసిందే. ఆది సాయికుమార్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, వైభ‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన 'నెక్స్ట్ నువ్వే' (2017) పేరుకు త‌మిళ ఫిల్మ్ 'యామిరుక్క బ‌య‌మే'కు రీమేక్ కానీ, దాని ఒరిజిన‌ల్ 'ద క్వ‌య‌ట్ ఫ్యామిలీ' (1998) అనే కొరియ‌న్ ఫిల్మ్‌.

అయితే కొరియ‌న్ హిట్ 'మిస్ గ్రానీ'ని ల‌క్ష్మి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నందినీరెడ్డి 'ఓ బేబీ' పేరుతో రీమేక్ చేశాక‌, అఫిషియ‌ల్ రీమేక్స్ వైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు కూడా దృష్టి సారిస్తున్నారు. అట్లా ప్ర‌స్తుతం 'మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్' తెలుగులో రీమేక్ అవుతోంది. ఆ మూవీతో పాటు 'డాన్సింగ్ క్వీన్' (2012) రీమేక్ రైట్స్‌ను కూడా నిర్మాత డి. సురేశ్‌బాబు తీసుకున్నారు. ఆయ‌నే మ‌రో రెండు నిర్మాణ సంస్థ‌లు గురు ఫిలిమ్స్‌, ఎస్‌.కె. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి మ‌రో కొరియ‌న్ ఫిల్మ్ 'ల‌క్కీ కీ' రీమేక్ హ‌క్కులు పొంది, తెలుగు స‌హా ప‌లు భార‌తీయ భాష‌ల్లో దాన్ని రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.