Read more!

English | Telugu

న‌మ్మ‌లేని నిజం.. తెర‌మీద బాలుకు తెర‌వెనుక పాడిన 'క‌న్న‌డ కంఠీర‌వ' రాజ్‌కుమార్‌!

 

గాన‌గంధ‌ర్వుడైన ఎస్పీ బాలుకే మ‌రొక‌రు నేప‌థ్య గానం అందించారంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. కానీ నిజంగా అది నిజం. ఒక క‌న్న‌డ సినిమాలో బాలుకు ఏకంగా 'క‌న్న‌డ' కంఠీర‌వ రాజ్‌కుమార్ పాట‌లు పాడారు. అదేమీ డ‌బ్బింగ్ సినిమా కాదు. స్ట్ర‌యిట్ క‌న్న‌డ ఫిల్మ్‌. ఆ సినిమా పేరు 'ముద్దిన‌మావ' (1993). తెలుగులో హిట్ట‌యిన దాస‌రి నారాయ‌ణ‌రావు సినిమా 'మామ‌గారు'కు అది రీమేక్‌. ఓం సాయిప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. ఒరిజిన‌ల్‌లో దాస‌రి చేసిన పాత్ర‌ను క‌న్న‌డంలో బాలు చేశారు. వినోద్ కుమార్ చేసిన హీరో క్యారెక్ట‌ర్‌ను తెలుగువాడైన శ‌శికుమార్ పోషించాడు. సినిమాలో బాలు పాత్ర‌కు రెండు పాట‌లు, శ‌శికుమార్ పాత్ర‌కు మూడు పాట‌లు ఉన్నాయి.

ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాలు. త‌నపై పాట‌లు త‌ను పాడి, శ‌శికుమార్‌కు త‌న ద‌గ్గ‌ర ట్రాక్స్ పాడుతున్న రాజేశ్‌తో పాడించాల‌ని బాలు అనుకున్నారు. ఈ రాజేశ్ ఎవ‌రో కాదు.. నాగార్జున 'నిన్నే పెళ్లాడుతా' సినిమాలోని బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ "ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు"ను పాడిన‌వాడు. బాలు ఆలోచ‌న‌కు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు స‌రేన‌న్నారు. కానీ హీరో శ‌శికుమార్ మాత్రం త‌న పాత్ర‌కు బాలునే పాడాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. అటు హీరోకీ, ఇటు త‌న‌కూ త‌న గొంతే ఉంటే బాగుండ‌ద‌ని బాలు అభిప్రాయం. కానీ హీరో ఏమో మొండికేశాడ‌య్యే. దాంతో ఓ నిర్ణ‌యం తీసుకున్నారు బాలు.

త‌న‌కు రాజ్‌కుమార్ పాడితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో చెప్పారు. వారు ఒప్పుకున్నారు. అయితే రాజ్‌కుమార్ దీనికి అంగీక‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌. త‌నే స్వ‌యంగా రాజ్‌కుమార్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అడిగారు బాలు. "అయ్య బాబోయ్‌.. నేను మీకు పాడ్డ‌మా? అంత సాహ‌సం చేయ‌లేను బాలుగారూ.. క్ష‌మించండి" అనేశారాయ‌న‌. బాలు ఎంత బ‌ల‌వంతం చేసినా ఆయ‌నది అదే మాట‌. "అన్న‌గారూ.. ఆ పాట‌ల‌కు ట్రాక్‌లు నేనే పాడుకుంటాను. షూటింగ్ కూడా ఆ ట్రాక్‌ల‌తోనే చేస్తాం. ఆ ట్రాకులు బెంగ‌ళూరు చాముండేశ్వ‌రి థియేట‌ర్‌లో ఉంటాయి. మీరు ఎప్పుడు కుదిరిదే అప్పుడు మిక్స్ చేసి ఇస్తే, ఆ త‌ర్వాత మీ వాయిస్‌తో నేను పోస్ట్ చేసుకుంటా." అని చెప్పి, ఆయ‌న స‌మాధానం కోసం వెయిట్ చేయ‌కుండా వ‌చ్చేశారు ఎస్పీ బాలు.

అయినా కూడా "అలా కుద‌ర‌దు" అని బాలుకు చెప్పించారు రాజ్‌కుమార్‌. బాలు య‌థాప్ర‌కారం షూటింగ్ చేశారు. అప్పుడెందుకో రాజ్‌కుమార్ మ‌న‌సు మార్చుకున్నారు. వ‌చ్చి ఆ రెండు పాట‌లు పాడారు. "మీ అంత బాగా పాడ‌లేను. న‌చ్చ‌క‌పోతే తీసేయండి." అని కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ ఆయ‌న పాట‌ల‌నే సినిమాలో ఉప‌యోగించుకున్నారు. రాజ్‌కుమార్ చాలా బాగా పాడారు. క‌న్న‌డ కంఠీర‌వ లాంటి గొప్ప న‌టుడు గాన గంధ‌ర్వుడు బాలుకు గాత్రం ఇవ్వ‌డం ఓ మ‌ర‌పురాని అరుదైన ఘ‌ట్టం.